కురవి: ‘గత ఎన్నికల్లో మంత్రిగారి సొంత తండాలో నాకు ఓట్లు పడలె..’అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి సత్యవతి రాథోడ్ బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. అదృష్టం బాగుంది. మహిళ అనో.. భర్త లేడనో.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు’అని పేర్కొన్నారు. సత్యవతికి మంత్రి పదవి వచ్చినందుకు తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే.. గత సొసైటీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన నూకల వేణుగోపాల్‌రెడ్డిని వెంటేసుకొని తిరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీటీసీ, ఎంపీపీ ఊర్లో పార్టీ అభ్యర్థి గెలవడు.
మంత్రి గారి తండాలో ఓట్లు రావు. పార్టీకి ద్రోహం చేసిన వారి గురించి అసలు పట్టించుకోవడం లేదు.. పైగా నాకు కూడా చెప్పకుండా తన నియోజకవర్గంలో వారిని వెంబడేసుకుని తిరగడం ఎంత వరకు సమంజసమో మంత్రి గారి విజ్ఞతకే వదిలేస్తున్నా’అని రెడ్యానాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిలిస్తేనే ఆ నియోజకవర్గంలో రావాలి.. 33 జిల్లాలు ఉన్నాయి. ఎక్కడన్నా తిరుగు వద్దంటారా? అని ఎద్దేవా చేశారు. తామందరమూ ఒకే పార్టీకి చెందిన వారమని, ఎక్కడైనా వర్గపోరుంటే సరిచేయాలే గానీ, ఇలా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. గతంలో కూడా తనను దెబ్బతీద్దామని చూశారని, తాను జాగ్రత్తలు తీసుకోవడానికి వారు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పార్టీ ద్రోహులపై ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే ఏనాడైనా దెబ్బతినడం ఖాయమని రెడ్యానాయక్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment