అప్పు ఇస్తూ ఎన్నికల డప్పు! | DWCRA Women Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అప్పు ఇస్తూ ఎన్నికల డప్పు!

Published Mon, Jan 28 2019 7:26 AM | Last Updated on Mon, Jan 28 2019 12:44 PM

DWCRA Women Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మహిళలను మోసగించడానికి ఎత్తులు వేస్తున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తూ మరోసారి అధికారంలోకి రావడానికి పాచికలు విసురుతున్నారు. రుణాలు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే ‘మాఫీ’ చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిన తీరు చూసి అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళలు నిర్ఘాంతపోయారు. ఆయన మాటలు నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత.. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న సమయంలో మరోమారు మహిళలకు ఎన్ని‘కల’ తాయిలాలు ప్రకటిస్తున్నారు.

అధికారంలోకి రావాలని కొత్త ఎత్తుగడ  
సీఎం చంద్రబాబు తాజాగా ‘పసుపు – కుంకుమ’ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం అప్పుగా ఇస్తున్నప్పటికీ, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. రాష్ట్రంలోని 93.80 లక్షల మందికి రూ.9,380 కోట్లు ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో తొలిదఫాలో రూ.2,500, రెండో దఫాలో రూ.3,500, మూడో దఫాలో రూ.4 వేల చొప్పున మహిళల ఖాతాల్లో జమ అయ్యేలా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బును మూడు దఫాల్లో ఇస్తామని చెబుతున్న చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని డ్వాక్రా సంఘాల మహిళలు చెబుతున్నారు. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే ఎన్నికల కమిషన్‌ దీన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు దీనిని ప్రకటించారని, నెపం ఎన్నికల కమిషన్‌పై వేసి లబ్ధి పొందాలని చూస్తారని ఓ అధికారి అన్నారు.
 
అప్పుల ఊబిలో మహిళలు విలవిల
2014 ఎన్నికల ముందు చెప్పిన విధంగా డ్వాక్రా రుణ మాఫీ సాధ్యం కాదని అధికారం చేజిక్కించుకున్నాక చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పారు. మాఫీకి బదులు పెట్టుబడి నిధిగా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం కూడా రూ.3 వేలు, 3 వేలు, 2 వేలు, 2 వేలు ఇలా నాలుగు దఫాలుగా అందజేశారు. బాబు వాగ్దానాన్ని నమ్మిన మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు నోటీసులిచ్చారు. నగలు వేలం వేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా వడ్డీ రూపంలో జమ చేసుకున్నారు. దీంతో చాలా మంది మహిళలు తాము తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే తిరిగి అప్పులు చేయాల్సి వచ్చింది.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా వైపే మహిళలు
చంద్రబాబు ప్రభుత్వం ఇస్తానంటున్న రూ.10 వేల కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన ‘వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా వైపే మహిళలు మొగ్గు చూపుతున్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా అందజేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల రోజు వరకు డ్వాక్రా మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మేది లేదని, నమ్మి మోసపోయింది చాలని అంటున్నారు. 

మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము
డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఈ డబ్బులు పూర్తిగా ఇస్తారనే నమ్మకం మాకు లేదు. ఒకసారి మోసపోయాం. మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము. – కంచికచర్ల పద్మావతి, డ్వాక్రా మహిళ, పరిటాల, కృష్ణా జిల్లా

నాటి హామీ ఏమైంది?
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వస్తారు. నాడు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేసి తర్వాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు అంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.10 వేలను ఒకేసారి ఇవ్వాలి. – కృష్ణా వీరనారాయణమ్మ, డ్వాక్రా మహిళ, గండేపల్లి, కృష్ణా జిల్లా

ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? 

ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆ తర్వాత నిండా ముంచారు.  నాలుగున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ పసుపు–కుంకుమ పేరుతో మా వద్దకు వస్తున్నారు. రూ.10 వేలు ఇవ్వాలనుకుంటే ఒకేసారి నగదుగా ఇవ్వొచ్చుగా? ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో డ్వాక్రా మహిళలు లేరు.
– మూడెడ్ల ఉమా, డ్వాక్రా మహిళ, గుడివాడ, కృష్ణా జిల్లా

జగన్‌ రూ.75 వేలు ఇస్తామంటున్నారు
డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాట తప్పే నాయకుడు కాదు. జగన్‌ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాం. ఇకపై మోసపోయే పరిస్థితి లేదు. రుణమాఫీని ఏమార్చి పసుపు–కుంకుమ అని ఎప్పుడో చెల్లేలా బాబు చెక్కులు ఇస్తే వాటిని ఏం చేసుకోవాలి? – మాదాసు వెంకటలక్ష్మి, గుడివాడ, కృష్ణా జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement