సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేటుచేసుకున్నాయి. జిల్లాలోని డెల్టా, మెట్ట ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే కొన్ని కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో జిల్లా ఎన్నికల ముఖచిత్రమే మారిపోయింది. జిల్లా రాజకీయాల్లో కీలకమైన తోట ఫ్యామిలీ ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరింది. కాకినాడ ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోట నరసింహం ఫ్యాన్‌కు జై కొట్టారు. ఈ కుటుంబ ప్రభావం జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. ఇక ఆయన సతీమణి వాణిది కోనసీమ. ఆమె తండ్రి, దివంగత నేత మెట్ల సత్యనారాయణ కోనసీమలో ప్రముఖ నాయకుడు. ఇప్పుడు మెట్ల కుటుంబం కూడా వాణికి మద్దతుగా నిలవనుంది. ఇక తూర్పు మెట్ట రాజకీయాల్లో పర్వత కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడా కుటుంబమంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడింది.
ఇప్పటికే ప్రత్తిపాడు టిక్కెట్‌ను పర్వత పూర్ణచంద్రప్రసాద్‌కు కేటాయించారు. తమకు టీడీపీ అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పర్వత సుబ్బారావు సతీమణి బాపనమ్మ, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీలోకి ఫిరాయించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి ఫ్యామిలీ వైఎస్ జగన్ వెంటే ఉంది. విజయలక్ష్మీ, కుమారులు రాజా, గణేష్‌లు పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. రాజాకు రాజానగరం టిక్కెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, కోనసీమలో పట్టున్న కుడిపూడి కుటుంబం వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత కుడిపూడి ప్రభాకరరావు కుమారుడు బాబు కూడా పార్టీకి అండగా నిలబడ్డారు. పి.గన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాలపై ఆ కుటుంబం ప్రభావం చూపనుంది.
Comments
Please login to add a commentAdd a comment