
సత్తెనపల్లిలో టోకెన్లు పంపిణీ చేస్తున్న కోడెల
గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇవేమీ తమకు వర్తించవన్నట్లుగా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇష్టానుసారంగా పంపిణీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కోడెల శివ ప్రసాదరావు 19 వ వార్డులో ప్రచారం చేపట్టారు. సమీపంలోని చర్చిలో స్థానికులను సమావేశపరిచారు. ఇంటి స్థలాలకు సంబంధించి వారికి టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్‌ఎస్‌పీ అతిథి గృహం పక్కనే ఉన్న రహదారి మరమ్మతుల విషయాన్ని స్థానికులు కోడెల దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే పొక్లెయిన్‌ను పిలిపించి మరమ్మతులు చేపట్టారు.
రహదారిపై డస్ట్ వేసేందుకు యుద్ధప్రాతిపదికన డస్ట్‌ను సిద్ధం చేశారు. మీరు అడిగిన పనులు చేస్తున్నాను. మీ ఓటు నాకే వేయాలంటూ ప్రచారం చేసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. గురజాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమావేశం ముగిసిన అనంతరం నేరుగా నాయకులతో కలసి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడ పార్టీ నాయకులతో రహస్యంగా సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment