సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాదంతా ఎన్నికలే ఎన్నికలు! వరుసగా శాసనసభ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు రానున్నాయి. ఏడాదిలో నాలుగు పర్యాయాలు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి రావడంతో రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కుంటుపడే అవకాశాలున్నాయి. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పరిపాలన, పోలీసు యంత్రాం గాలు ఇతర పనులను పక్కనబెట్టి ఏడాది పొడవునా ఎన్నికల ఏర్పాట్లలో గడపక తప్పని పరిస్థితి ఉత్పన్నం కానుంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో నిర్దిష్ట గడువుకు 8 నెలల ముందే ఎన్నికలు అనివార్యమయ్యాయి. వచ్చే నవం బర్, డిసెంబర్‌లలో శాసనసభకు ఎన్నికలు నిర్వహిం చే అవకాశముంది.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటే తెలంగాణకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అంశంపై సాధ్యాసాధ్యాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. అపద్ధర్మ ప్రభుత్వం అయాచిత ప్రయోజనం పొందేలా 6 నెలలపాటు అధికారంలో ఉండకూడదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని 2002లో సుప్రీం కోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ముందుగా నిర్వహిం చేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిం చింది. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన 3 నెలలకే లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీతోపాటు మూడు నెలల కాలం పూర్తిగా ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించకతప్పని పరిస్థితి ఉత్పన్నం కానుంది. వరుసగా జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన, పోటాపోటీగా ప్రచార కార్యక్రమాల నిర్వహణలో రాజకీయ పార్టీలు రానున్న 6 నెలల సమయాన్ని వెచ్చించనున్నాయి. రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగాలు సైతం వచ్చే ఆరు నెలల పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఏర్పా ట్లు, నిర్వహణ, బందోబస్తు విధుల్లో తీరిక లేకుండా గడపనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్లు ఓటర్ల జాబితాల రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ నిర్వహణ, ఫలితాల ప్రకటన పను ల్లో బిజీగా గడపనున్నారు.
తొలి 6 నెలలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో గడిచిపోనుండగా, మిగి లిన ఆరు నెలల్లో వరుసగా గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించకతప్పని పరిస్థితి రానుంది. గ్రామ పంచాయతీల పదవీ కాలం గత ఆగస్టు 1తో అయిపోయింది. కొత్తగా ఏర్పడిన 4,380 గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 12,751 పంచాయతీలకు వచ్చే జూన్–జూలైలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వం.. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా వీచిన గాలిని సొమ్ము చేసుకోవడానికి వెంటనే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కులాల వారీగా బీసీల జనాభా గణ న నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజ ర్వేషన్లను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించడం తో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలి సిందే.
2019 జూన్–జూలైలో జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే ఆగస్టు– సెప్టెంబర్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. రాష్ట్రంలోని మెజా రిటీ మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం సైతం వచ్చే ఏడాది జూన్/జూలైలో ముగియనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీలతో కలిపి 130కి పైగా మునిసిపాలిటీలకు సైతం జడ్పీటీ సీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటే ఆగస్టు–సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఏదైనా కారణాలతో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు కొద్దిగా ఆలస్యమైనా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకే అవకాశాలెక్కువ ఉన్నాయి. వచ్చే ఏడాదంతా వరుసగా ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో పాలనపై ప్రభావం చూపనుంది.
Comments
Please login to add a commentAdd a comment