సాక్షి, హైదరాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్... లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల ఆదరణ పొందేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు ప్రారంభించి లోక్‌సభ ఎన్నికలలో ప్రజల మద్దతు కూడగట్టాలని యోచిస్తున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం తొలుత మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి మొదటి వారంలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్‌లోకి తీసుకోవా లని భావిస్తున్నారు. సామాజికవర్గాలు, జిల్లా సమీకరణలకు అనుగుణంగా తొలి విడత విస్తరణ జరపనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే శాసనమండలి సాధారణ ఎన్నికల షెడ్యూల్ జారీ కానుంది. మూడో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో హామీల అమలుపై నిర్ణయాలు తీసు కునే పరిస్థితి ఉండదు. దీంతో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు సాయం పెంపు, ఆసరా పెన్షన్ల వయోపరిమితి సడలింపు, ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి కీలక అంశాలపై తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
వడివడిగా హామీల అమలు...
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే వాటిని మరింత విస్తృతం చేస్తామని పేర్కొంది. ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 58 ఏళ్లకు తగ్గిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. రైతుబంధు పథకం కింద పంపిణీ చేసే సాయాన్ని ఎకరానికి ఇప్పుడున్న రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ంది. గత ఎన్నికల తరహాలోనే రూ.లక్ష వరకు ఉండే పంట రుణాలను మాఫీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామని, నిరుద్యోగ భృతి కింద అర్హులకు నెలకు రూ.3,016 చెల్లిస్తామని పేర్కొంది. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా నారాయణపేట, ములుగు జిల్లాలతోపాటు కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వయోపరిమితి సడలింపు నేపథ్యంలో ఆసరా పెన్షన్ల అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆసరా పెన్షన్ల అమలులో కొత్త విధానం అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ నుంచి రైతుబంధు సాయాన్ని పెంచనున్నారు. మిగిలిన హామీల అమలు విషయంలోనూ ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ పథకాలలో మార్పులు, పంట రుణాల మాఫీ, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం తెలపనున్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక అమలుకు అవసరమైన నిధులు కేటాయింపు, ఆదాయ వనరుల పెంపు అంశాలపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లోనే దీనికి సంబంధించిన నిధులను కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment