
సాక్షి, కడప రూరల్ : మంత్రి ఆదినారాయణరెడ్డిపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను మొదటి నుంచి టీడీపీలో ఉన్నా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఆదినారాయణరెడ్డి ఏడాది కిందట వచ్చారు. మంత్రి పదవి పొందారు. నా ముందు ఆయన చాలా జూనియర్. ఇటీవల ఆది రెండుసార్లు కమలాపురానికి వచ్చి నా ప్రస్తావన తీసుకురావడం ఏంటి? నాకు సీటు వస్తుందా? గెలుస్తారా? అని అడగడం.. మరొక నాయకుడి గురించి మాట్లాడుతూ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు.. ఈసారి ఎలాగైనా ఆయనను గెలిపించాలని తన సహచరులతో చెప్పడం ఏంటి? అని నిలదీశారు.
కమలాపురం, బద్వేలుతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో సీటు మీకిస్తాం.. వారికిస్తామని చెప్పి పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సీఎం గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయిస్తారన్నారు. జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌చార్జి రామసుబ్బారెడ్డి ఒకసారి మినీ మహానాడు నిర్వహిస్తే అందుకు పోటీగా మంత్రి ఆదినారాయణరెడ్డి రెండవసారి మినీ మహానాడును నిర్వహించడం శోచనీయమన్నారు. కాగా మంత్రి ఆది వ్యవహార తీరుపై ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు సీఎంకి ఫిర్యాదు చేశామన్నారు. ఆదిపై చర్యలు చేపట్టకపోతే జిల్లాలో ఆ ఒక్క సీటు కూడా మిగలదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment