సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ అకౌంట్లు, పేజీలను భారీ స్థాయిలో తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పోమవారం వెల్లడించింది. యూజర్లను తమ పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నందు వల్లే ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. అలాగే తొలగించిన కొన్ని నమూనా పేజీలను కూడా పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌లో పనిచేసే వారి వ్యక్తిగత అకౌంట్లతో సంబంధం ఉన్న ఎఫ్‌బీ పేజీలను తొలగించినట్లు ఎఫ్‌బీ సైబర్ సెక్యూర్టీ హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. వీటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. వ్యక్తులు వారి గుర్తింపును దాచి పెట్టడానికి ప్రయత్నించినా, కాంగ్రెస్ ఐటీ సెల్‌తో ఉన్న అనుబంధం ద్వారా గుర్తించామన్నారు. ఆయా అకౌంట్ల ప్రవర్తన ఆధారంగా తొలగిస్తున్నామనీ, అయితే ఈ తొలగింపులు వారు పోస్ట్ చేసిన కంటెంట్‌కు సంబంధించి కాదని తెలిపింది. అయితే తమ ప్లాట్‌ఫాంను అనుచిత పద్ధతుల్లో వాడడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.
పాకిస్థాన్ నుంచి ఫేక్ అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నందున మరో 103 ఖాతాలను తొలగిస్తున్నట్లు కూడా ఫేస్‌బుక్ వెల్లడించింది. మిలిటరీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్తల పేజీలు, కశ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) ఉద్యోగులు ఈ నకిలీ అకౌంట్లను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎఫ్‌బీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment