పోలీసులు నరకం చూపించారు | Fake Cases Files on YSRCP Leaders Chittoor | Sakshi
Sakshi News home page

పోలీసులు నరకం చూపించారు

Published Sat, Mar 9 2019 12:28 PM | Last Updated on Sat, Mar 9 2019 12:28 PM

Fake Cases Files on YSRCP Leaders Chittoor - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నంగా నరేష్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, మునికృష్ణ

తిరుపతి రూరల్‌: ‘‘మాకు సంబంధం లేని కేసులో  ఇరికించారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు రాత్రుల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక వాహనం మార్చి ఎస్పీ బంగళాకు తీసుకెళ్లారు. అక్కడ కొట్టారు. అక్కడ నుంచి  పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఇష్టారాజ్యంగా చితకబాదారు. చేయని తప్పును ఒప్పుకోవాలని వేధించారు.  ముఖంపై బూటు కాలుని పెట్టి  తొక్కారు. కాళ్ల వేళ్లను నలిపివేశారు. ముక్కులో నుంచి రక్తం కారుతున్నా వదలలేదు. అరికాళ్లను లాఠీలతో పచ్చడి చేశారు. చిత్తూరు ఎస్పీ సమక్షంలోనే రాత్రీ పగలూ అనే తేడా లేకుండా ఒకరు తర్వాత ఒకరు మార్చి మార్చి కొట్టారు. నరకం చూపించారు. ఒక దశలో ప్రాణాలతో ఇళ్లకు చేరుతామనే ఆశను వదులుకున్నాం.

ఇంతగా పోలీసు బాస్‌ మమ్మల్ని టార్గెట్‌ చేసి వేధించాల్సిన నేరం ఏమి చేశాం? సర్వే పేరుతో ట్యాబ్‌లతో పల్లెలకు వచ్చి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను సెల్ప్‌ డెలిషియన్స్‌ పేరుతో తొలగిస్తున్న యువకులను పోలీసులకు పట్టించడటమే నేరమా? ఓట్ల దొంగలను వదిలి.. పట్టించిన మాపై అక్రమ కేసులు పెట్టి వేధించాల్సిన అవసరం ఏమిటి? అ    క్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఆ పోలీసులను వదలం. సూత్రధారి పోలీసు బాస్‌తో పాటు పాత్రధారులుగా ఉన్న సీఐ, ఎస్‌ఐలను కోర్టు ముందు దోషులుగా నిలబెడతాం’’ అని పాకాల మార్కెటింగ్‌ యార్డు మాజీ చైర్మన్‌ నంగా నరేష్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు చెన్నకేశవరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రకాష్‌రెడ్డి, మునికృష్ణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని  జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాకాలలో గత నెల 24న సర్వే పేరిట కొందరు యువకులు ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారన్నారు. స్థానికుల సమాచారంతో తాము వెళ్లి పరిశీలించగా ట్యాబ్‌లో ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటంతో ట్యాబ్‌లతో సహా ముగ్గురు యువకులను పాకాల పోలీసులకు అప్పగించామన్నారు. కానీ వారిని వదిలేసి, తమపైనే  తప్పుడు కేసులు బనాయించి, వేధించారని ఆరోపించారు. ట్యాబ్‌లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఇచ్చామని చెప్పాలని వేధించారన్నారు. పోలీసులకే అప్పగించామని ఎంతగా మొత్తుకున్నా...ఎస్పీ, డీఎస్పీలు వినిపించుకోలేదన్నారు. ఎమ్మెల్యే పేరు చెబితేనే వదిలేస్తామని, లేకపోతే భార్యాపిల్లలను ఎత్తుకొస్తామని చిత్రహింసలు పెట్టారన్నారు. చిత్తూరు ఎస్పీ, డీఎస్పీ, పాకాల సీఐ, ఎస్‌ఐలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అమ్మమ్మ మరణించినా వదలని పోలీసులు
చనిపోయిన తన అవ్వను చివరి చూపు కూడా చూడనీయకుండా పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని మునికృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. ట్యాబ్‌ గురించి తన తెలియదని మొత్తుకున్నా పట్టించుకోకుండా తాను పనిచేస్తున్న కారు యజమాని నరేష్‌రెడ్డి ట్యాబ్‌ను దాచారని చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు.

రాడ్‌లు తీస్తామన్నారు
తనకు రోడ్డు ప్రమాదంలో కాళ్లూ చేతులకు రాడ్‌లు వేశారని,  రాడ్‌లు ఉన్న శరీర భాగాలపైనే పోలీసులు తీవ్రంగా కొట్టారని ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల విషయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమేయం ఉన్నట్టు చెప్పకపోతే  కాళ్లలో, చేతుల్లో ఉన్న రాడ్‌లు బయటకు వచ్చేలా కొడతామని చిత్తూరు డీఎస్పీ, పాకాల సీఐ తనపై శివాలెత్తారని తెలిపారు.

భారీమూల్యం చెల్లించక తప్పదు
ఏ పార్టీ నాయకుల మెప్పుకోసమో పోలీసులు తమను తీవ్రంగా చిత్రహింసల పాల్జేశారో అందరికీ తెలుసని,  భవిష్యత్తులో వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ఇలాంటి వాటికంతా వెనుకంజ వేసేది లేదని, మరింత క్రియాశీలకంగా పనిచేస్తూ, ఇంటింటా తిరిగి అధికార పార్టీ అక్రమాలు, పోలీసుల దాష్టీకాన్ని ఎండగడతామని వైఎస్సార్‌ సీపీ నాయకులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement