
జూబ్లీ హిల్స్‌లోని ‘సర్వే ఆఫ్ ఇండియా’ కార్యాలయంలో కూర్చొని ఉన్నాడు కేఏ పాల్. అతడి చేతిలో తడిగుడ్డ ఉంది.
‘‘మా ఎదవలు.. పడుకున్నవాడిని లేపుకొచ్చారు’’ అన్నాడు పాల్!
‘‘వారం రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకుని తడిగుడ్డ వేసుకుని పడుకోవటం ఏంటండీ పాల్‌గారూ చికాగ్గా..’’ అన్నాడు పక్కన ఉన్న నాయకుడు.
‘‘ఎండ ఎక్కువయింది కాబట్టే కదా తడిగుడ్డ. ఇదిగో ఇక్కడికొస్తే తడిగుడ్డతో పనుండదని చెప్తే వచ్చా. అవునూ.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ఉప్పల్‌లో కదా ఉండేది. ఇక్కడికెప్పుడు షిఫ్ట్‌చేశారు’’ అని అడిగాడు పాల్.
‘‘నాకూ తెలీదు.. ఇక్కడికి షిఫ్ట్ చేశారని! ముందు ఉప్పలే వెళ్లాను. వాడెవడో రూడ్‌గా మాట్లాడాడు.. ‘అలాంటి సర్వేలేమీ మా దగ్గర నడవ్వు. జూబ్లీ హిల్స్ వెళ్లు’ అంటే ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని ఇక్కడ చూడగానే ఇదే సర్వే ఆఫ్ ఇండియా అని తెలిసిపోయింది’’ అన్నాడు ఆ నాయకుడు.
పాల్ నవ్వాడు. ‘‘చూశారా, నేను రావడం మీకెంత మంచిదయిందో’’ అన్నాడు. అని, ‘‘మిమ్మల్నెప్పుడూ చూడలేదు. మీరు గానీ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ కాదు కదా’’ అన్నాడు.
పాల్ అలా అనగానే ఆ లీడర్ ఎమోషనల్‌గా కళ్లు తుడుచుకున్నాడు. ‘‘మీదెంత పెద్ద మనసు! కనిపించనివాళ్లను కూడా గుర్తించగలుగుతున్నారు’’ అన్నాడు.
పాల్ మళ్లీ నవ్వాడు. ‘‘దాన్ని పెద్ద మనసు అనరు. నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్‌తో ఎవర్నైనా జయించవచ్చు. ఈ సృష్టిని జయించవచ్చు. వైఎస్సార్‌సీపీని జయించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకొచ్చామ్! ఈ మనిషి దగ్గర నాలెడ్జ్ ఉందనే కదా. మొన్నటి వరకు లగడపాటికొక్కడికే స్టేట్‌లో నాలెడ్జ్ ఉందనుకునేవాడిని. ఈ మనిషికి లగడపాటిని మించిన నాలెడ్జ్ ఉందని మా పార్టీ కార్యకర్తలు చెబితే మొదట నేనూ నమ్మలేదు. ‘నవ్యాంధ్రజ్యోతి’ పేపర్ చూపించారు. సర్వే ఏమీ జరక్కుండానే ‘అధికారం టీడీపీదే’ అని సర్వే రిపోర్ట్ ఇచ్చాడు.. అదీ నాలెడ్జ్ అంటే’’ అన్నాడు.
నాయకుడు ఆసక్తిగా వింటున్నాడు.
‘‘సర్వే జరక్కుండానే.. వచ్చే సీట్లెన్నో, పడే ఓట్లెన్నో ఇచ్చాడంటే ఇతగాడు మామూలు సర్వే మాస్టర్ కాదు! ఇవన్నీ వదిలెయ్, జరగని సర్వేను జరిపించిందెవరో కూడా రాసి గ్రాఫులతో సహా వేసి పడేశాడు!’’ అన్నాడు పాల్.
ఈలోపు లోపల్నుంచి చేతిలో
చిన్న వైట్ పేపర్, బాల్‌పెన్ ఉన్న ఇద్దరు మనుషులు వచ్చి.. ఒకరు పాల్ దగ్గర, ఇంకొకరు కాంగ్రెస్ నాయకుడి దగ్గర కూర్చున్నారు.
పాల్ దగ్గర కూర్చున్న మనిషి.. ‘‘చెప్పండి పవన్‌కళ్యాణ్ గారూ.. మీకు ఎన్ని సీట్లు కావాలి? ఓట్ల శాతం ఎంత కావాలి’’ అని అడిగాడు, బాల్‌పెన్‌ని రెండు వేళ్లతో ఊపుతూ.
పాల్ మురిసిపోయాడు. ‘‘నేను పవన్‌కళ్యాణ్‌లా కనిపిస్తున్నానా?’’ అన్నాడు అతడి బుగ్గపై చిటికె వేసి.
‘‘ఓ! మీరు నిజంగానే పాల్ అన్నమాట. జనం గుర్తుపట్టకుండా ఉండడానికి పవన్‌కళ్యాణ్ మీ వేషంలో వచ్చాడనుకున్నాను. మా మాస్టర్ సర్వే కృష్ణ చెప్పారు.. పవన్ కూడా ఓ మంచి సర్వే కోసం ఇక్కడికి వస్తున్నారని’’ అన్నాడు.
‘‘మీ మాస్టర్ సర్వే రాధ కదా.. సర్వే కృష్ణ అంటున్నావేంటి’’ అన్నాడు పాల్.
‘‘ఇద్దరూ ఒకటే పాల్‌గారూ.. సెక్యూరిటీ ప్రాబ్లమ్. అందుకే రెండు పేర్లు యూజ్ చేస్తుంటాం’’ అన్నాడు.. బాల్‌పెన్‌ని ఊపడం ఆపకుండా.
ఇక్కడ వీళ్లు ఈ పనిలో ఉంటే.. లోపల సర్వే మాస్టర్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది.
‘‘నీ సర్వేలు అందరికీ ఇస్తున్నావ్. ఇంక మాకిచ్చి ఉపయోగం ఏమిటి? రేప్పొద్దున నీ పేపర్‌లో ‘అధికారం పాల్‌దే’ అని రాస్తే నీకు పోయే క్రిడిబిలిటీ ఏమీ లేదు! మా క్రెడిబిలిటీనే పోతుంది..’’ అన్నాడు చంద్రబాబు కోపంగా.
పెద్దగా నవ్వాడు సర్వే మాస్టర్. ‘‘నాయుడుగారూ.. మీరు గెలిచారు’’ అన్నాడు.
‘‘ఇంకా పోలింగే జరక్కుండా నేను గెలవడం ఏంటయ్యా.. ఇదెవరి సర్వే?’’ అన్నాడు చంద్రబాబు విసుగ్గా.
‘‘పోలింగ్ అయ్యాకే మీరు గెలుస్తున్నారునాయుడు గారూ! పోలింగ్‌కి రెండు రోజుల ముందు అన్ని పార్టీల ప్రచారం ఆగిపోతుంది. దానికి ఒక రోజు ముందే మీ ప్రచారం ఆగిపోతుంది..’’ ప్లాన్ చెప్పుకుపోతున్నాడు సర్వే మాస్టర్.
–మాధవ్
Comments
Please login to add a commentAdd a comment