
వై.కోడూరు జంక్షన్‌లో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, జమ్మలమడుగు (వైఎస్‌ఆర్ జిల్లా): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం వై.కోడూరు జంక్షన్‌లో రైతులతో ముచ్చటించారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. మినుములు, శనగలు వంటి పంట ధాన్యాలకు మద్దతు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది మినుములు క్వింటాల్‌కు రూ. 13,700 ధర ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 3,700 మాత్రమే ఇస్తున్నారని, అదేవిధంగా ధనియాల ధర గత ఏడాది సుమారు రూ. నాలుగువేలకుపైగా ఉండగా.. ఈ ఏడాది రూ. 1800, రూ. 1900లకు పడిపోయిందని రైతులు వైఎస్ జగన్‌కు తెలిపారు. రైతుల వద్ద తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు, హెరిటేజ్ సంస్థ.. వారి నుంచి కొనుగోలు చేసిన తర్వాత ధర అమాంతం పెంచుతోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే రైతులు ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు వైఎస్ జగన్ భరోసా..
రాబోయే ఎన్నికల సమయంలో ప్రతి పంటకు మద్దతు ధరను ముందే ప్రకటిస్తామని, ప్రతి పంటకు ఇది మీ రేటు అని, అంతకన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాబోదని కచ్చితమైన హామీ ఇచ్చి ఎన్నికలకు వెళుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి పంటకు సరైన మద్దతు ధరను ప్రకటిస్తామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ. ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఇందుకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా రైతులు తమకు రుణమాఫీ అమలు కాలేదని వైఎస్ జగన్‌కు తెలిపారు. పంటలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు రుణమాఫీకి చెల్లించిన డబ్బు వడ్డీకి కూడా సరిపోవడం లేదని, బ్యాంకులే తమను డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాయని అన్నారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని, రైతుల బాధలు ఆయనకు అర్థంకావడం లేదని వైఎస్ జగన్ అన్నారు. నవరత్నాల పథకాలపై రైతుల అభిప్రాయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలపై ఏమైనా సలహాలు ఉంటే.. ఇవ్వాలని కోరారు. నవరత్నాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు.. రైతుభరోసా పథకాన్ని రైతులందరికీ వర్తించాలని సూచించారు.
ప్రతి పంటకు మద్దతు ధరను ముందే ప్రకటిస్తాం