భారత ఇతిహాసాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా అంతిమంగా ధర్మమే గెలిచినట్లు మనకు కనిపిస్తుంది. ఈ పరమసత్యం నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ధర్మం గెలుస్తుందన్న నమ్మకం అందరిలోకంటే, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న∙వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలోనే ఎక్కువగా కనిపించింది. కనుకనే, తనమీద జరిగిన కుట్రలను, అనైతిక దాడులను నిబ్బరంగా తట్టుకోగలిగారు. అదేపనిగా తనపై సాగిన అసత్య ప్రచారాలను, కల్పిత కథనాలకు కృంగిపోకుండా.. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. ప్రజల అండదండలతో.. దేశ చరిత్రలోనే ఓ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుని ఓ సరికొత్త అధ్యాయం లిఖించడానికి సమాయత్తం అవుతున్నారు.
గత ఐదేళ్ల రాజకీయ ప్రయాణం కత్తుల వంతెన మీద సాగింది. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రాంతీయ పార్టీల అధినేతలెవరూ ఎదుర్కొన్న దాఖలాలు చరిత్రలో కనపడవు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినపుడు ఆయనకు ఎన్నో అనుకూల అంశాలు కలిసొచ్చాయి. అప్పటి కాంగ్రెస్ నాయకత్వంపై ఉవ్వెత్తునలేచిన ప్రజావ్యతిరేకతతోపాటు, ఓ ప్రముఖ దినపత్రిక అందించిన అండదండలతోఎన్టీఆర్ అద్భుత విజయం కైవసం చేసుకున్నారు. 2001లో ప్రాంతీయపార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖరరావు 14 ఏళ్లపాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఆయన ఉద్యమానికి తెలంగాణ సమాజం యావత్తూ సహకరించింది.
ఎన్టీఆర్, కేసీఆర్‌లతో పోల్చితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం భిన్నమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందినపుడు.. ఆ విషాద వార్తను తట్టుకోలేక.. వందలాదిమంది బలన్మరణాలకు పాల్పడ్డారు. అనాధలై, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాల వారిని పరామర్శించి వారిలో భరోసా నింపడం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ధర్మంగా భావించారు. కానీ, ఆయన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం వ్యతిరేకించింది. జగన్ ధర్మం వైపే మొగ్గు చూపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ముందుకు వెళితే కష్టాలు తప్పవన్న శ్రేయోభిలాషుల హెచ్చరికల్ని ఆయన పట్టించుకోలేదు. కేంద్రమంత్రి పదవి ఆశచూపినా ఆయన నిర్ణయంలో మార్పు జరగలేదు. కొన్నాళ్లు వేచి ఉంటే రాష్ట్ర అధికార పగ్గాలు అప్పజెపుతామన్న అధిష్టానం ‘ఫీలర్ల’కు లొంగలేదు.
వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి తీసుకొన్న ఆ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర రాజకీయాల స్వరూపం పూర్తిగా మారింది. ఊహించినట్లుగానే.. కాంగ్రెస్ అధిష్టానం ప్రతీకార చర్యలకు దిగింది. వారి ఆదేశాలతో.. అనుచిత లబ్ధి జరిగిందంటూ జగన్‌పై కాంగ్రెస్ నేత శంకరరావు పిల్ వేశారు. ముందుగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. తెలుగుదేశం నేతలు ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. సీబీఐ, ఈడీ తదితర కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ కేసుల్లో జగన్‌ను అరెస్ట్ చేసి 17 నెలలపాటు బెయిల్ రాకుండా చంచల్‌గూడ జైలులో పెట్టారు. ఇదే అదనుగా.. చంద్రబాబు ఆయా వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన వ్యక్తులు, శక్తులు చెలరేగిపోయారు. పూటకో కథనం, రోజుకో అభూత కల్పన.. పతాక శీర్షికల్లో వండివార్చిన కథనాలు అచ్చు అయ్యాయి. కొన్ని చానెళ్లు మరో పని లేనట్లు జగన్‌పై వ్యతిరేక వార్తలు ప్రసారం చేశాయి. వాటిని ఆధారంగా చేసుకొని చంద్రబాబుకు బంటుల్లా మారిన కొన్ని రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు మీడియా సమావేశాలు పెట్టడం, విమర్శలు చేయడం నిత్యకృత్యమైంది. తమ పార్టీ ఒక్కటే విమర్శిస్తే.. దానికి తగిన బలం ఉండదు కనుక ఒకరు కొట్టిన దెబ్బమీద ఇంకొకరు మరో దెబ్బవేస్తే తిరిగి కోలుకోలేరన్న దుర్బుద్ధితో నలువైపుల నుండి దాడులు చేశారు. లక్ష కోట్లు అవినీతి జరిగిందన్న విష ప్రచారం తారస్థాయికి చేరింది.
జగన్ రాజకీయంగా ఎదిగితే తనకు పుట్టగతులు ఉండవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భయపడి కుట్రలకు తెర తీశారు. అయితే, సామాజిక బాధ్యత కలిగిన కొందరు పత్రికాధిపతులు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులు జగన్‌ను దెబ్బతీయడానికి చంద్రబాబుతో చేతులు కలిపారు. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగవ స్తంభంగా చెప్పుకొనే మీడియాలో మెజారిటీ వర్గం చంద్రబాబు పాలనలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపకపోగా.. అవే ఘనతగా కీర్తించాయి.
గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో చంద్రబాబు తన కీర్తికండూతి కోసం చేసిన నిర్వాకానికి 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనను కొన్ని పత్రికలు ఏవిధంగా మసిపూసి మారేడు కాయ చేశాయంటే.. సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నిద్రా హారాలు లేకుండా కంట్రోల్ రూమ్‌లో కూర్చొని పరిస్థితుల్ని చక్కదిద్ది భక్తుల ప్రశంసలు పొందారంటూ.. ఆ దుస్సంఘటనను సైతం చంద్రబాబుకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశాయి. అంతకు ముందు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టే క్రమంలో 20 మంది ఎర్రచందనం కూలీల్ని ఎన్‌కౌంటర్ చేసిన వార్తక్కూడా కొన్ని పత్రికలు, మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.
రాష్ట్రానికి చట్టబద్ధంగా లభించవలసిన ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు ఎన్ని ‘యు’ టర్న్‌లు తీసుకొన్నా, మాటలు మార్చినా, తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసినా.. చంద్రబాబు వైఖరిని కొన్ని పత్రికలు తప్పుపట్టలేదు. ప్రతిపక్షం గొంతును అసెంబ్లీలో నొక్కిన సందర్భంలో, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించినపుడు.. చివరకు ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఫిరా యించుకున్నప్పుడు, నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పుడు సైతం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సబబుకాదని చెప్పలేదు సరికదా.. తన ప్రభుత్వం కూలిపోకుండా.. చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారంటూ వంత పాడాయి, వక్ర భాష్యాలు పలికాయి.
అసెంబ్లీలో తమ గొంతు వినిపించే అవకాశం లేదని నిశ్చయమైనప్పుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకే వెళ్లాలని నిశ్చయించుకొని.. ‘మహాసంకల్పపాదయాత్ర’ చేప డితే.. ఆ వార్తను సింగిల్ కాలమ్ ఐటమ్‌గా కొన్ని పత్రికలు లోపలి పేజీలకు పరిమితం చేశాయి. పాదయాత్ర పొడవునా ప్రజలు వెల్లువెత్తినా, కొన్ని పత్రికలకు అవి వార్తలుగా కనిపించలేదు. చివరకు 3800 కిలోమీటర్లకు పైగా సాగిన మహాసంకల్పయాత్ర చరిత్ర సృష్టించినా అది కూడా కొన్ని పత్రికలకు ప్రత్యేకవార్తగా కనిపించలేదు.
అవమానకరమైన తెలుగుదేశం పార్టీ ఓటమికి కర్త, క్రియ, కర్మ అన్నీ చంద్రబాబేనని ప్రజలకు తెలుసు. అయినా, ఆయన ఓటమికి జన్మభూమి కమిటీలను నిందిస్తున్నారు. అవినీతికి పాల్పడిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను, అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడిన కొంతమంది మంత్రులను, మహిళలపై దాడులు చేసిన నాయకులను వెనకేసుకొచ్చింది ఎవరు? మెజారిటీ వర్గాల ప్రజలు వివిధ సమస్య లతో సతమతమవుతున్నారని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నా.. ప్రజలలో సంతృప్తస్థాయి 90%కి చేరిందని ఆత్మవంచనకు పాల్పడింది చంద్రబాబుకాదా?
చంద్రబాబుకు ఎక్కువ నష్టం చేసింది ఆయనకు గొడుగుపట్టిన కొన్ని పత్రికలు, చానళ్లు. జగన్‌కు తమ మీడియాలో తగిన ‘స్పేస్’ లభించకుండా చేశాయి. కానీ, ఆయన ప్రజల హృదయాలను ఆక్రమించారని అవి గ్రహించలేకపోయాయి. ఇపుడు, రాష్ట్రానికి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ పత్రికలకు, ఆ చానళ్లకు మింగుడు పడకపోవచ్చు. కానీ, ఇంతకుముందులా.. ఆయనకు సంబంధించిన వార్తలను సింగిల్ కాలమ్‌లో లోపలి పేజీల్లో వేయగలవా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపడం కష్టమని మరోసారి రుజువైంది.
వ్యాసకర్త : సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
మొబైల్ : 81069 15555
అవరోధాలను అధిగమించి... జననేతగా ఆవిర్భవించి...
Published Thu, May 30 2019 12:51 AM | Last Updated on Thu, May 30 2019 12:51 AM
Comments
Please login to add a commentAdd a comment