
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని టీడీపీ ఎన్నికలకు మరో 3 నెలలే ఉండడంతో అన్ని పథకాలను అమలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. ఎన్నికలు దగ్గరపడగానే వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు అమలు చేస్తారని, ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ప్రజందరూ గ్రహించారని అన్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరులో ‘నిను నమ్మం బాబు’ కార్యక్రమాన్ని ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఫెడరల్ ఫ్రంట్ కోసమే కేటీఆర్‌తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కానీ, దానిని కేసీఆర్‌తో పొత్తులు అని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి వైఎస్ జగన్‌పై లేనిపోని నిందలు వేస్తున్నారు’ అని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.