
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సీపీఐ నిర్ణయించింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా గురువారం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు సహా వివిధ అంశాలపై చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని సీపీఐ ఆరోపించింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నిలబెట్టేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది.