యడ్డికి షాక్‌! | Forest Department Shock to Karnataka CM Yeddyurappa | Sakshi
Sakshi News home page

యడ్డికి షాక్‌!

Published Thu, Aug 8 2019 7:47 AM | Last Updated on Thu, Aug 8 2019 7:47 AM

Forest Department Shock to Karnataka CM Yeddyurappa - Sakshi

యడియూరప్ప ,పళనిస్వామి

సాక్షి, చెన్నై: కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్‌ పడింది. కుమార స్వామి సర్కారు వదలిపెట్టిన పనిని తాను ముగించేందుకు దూకుడు పెంచగా, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ షాక్‌ ఇచ్చింది. మేఘదాతుకు అనుమతులు నో అంటూ ఆ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు అంగీకరించి, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పుడే డ్యాం సాధ్యమని తేల్చింది. సీఎం పళనిస్వామి చేస్తూ వచ్చిన ప్రయత్నాలకు తాజాగా ఫలితం తగ్గడం అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపింది.

కర్ణాటక– తమిళనాడు మధ్య కావేరి నదీ జలాల పంపిణీ వివాదం కొత్తేమీ కాదు.    తమిళనాడుకు ప్రతి ఏటా కర్ణాటక సర్కారు 177.25 టీఎంసీల నీళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఆ మేరకు జూన్‌లో 9.19 టీఎంసీలు, జూలైలో 31.24 టీఎంసీలు, ఆగస్టులో 45. 95 టీఎంసీలు, సెప్టెంబరులో, డిసెంబరులో 7.35 టీఎంసీలు, జనవరిలో 2.76 టీఎంసీలు, ఫిబ్రవరి నుంచి మే వరకు 2.5 టీఎంసీలు చొప్పున దశల వారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే, ప్రతిఏటా ఈ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. ఇక, గతంలో తమిళనాడుకు అనుకూలంగా కావేరి ట్రిబ్యునల్‌ ఇచ్చినతీర్పును తుంగలో తొక్కిన కేంద్రం పాలకులు ఎట్టకేలకు ప్రత్యామ్నాయంగా కావేరి యాజమాన్య సంస్థ, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీని మమా అనిపించే రీతిలో  ఏర్పాటు చేశారు. అయినా, తమిళనాడుకు ఒరిగింది శూన్యమే. ఈ కమిటీ ముందు సైతం నీటి కోసం సమరం సాగించాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. గత ఏడాది ఈ సంస్థ ఏర్పాటు చేసినా,  నైరుతి రుతుపవనాల రూపంలో భారీగానే కావేరిలోకి నీళ్లు వచ్చాయి. మెట్టూరు జలాశయం రెండు సార్లు నిండి, ఉబరి నీరు సైతం వృథాగా సముద్రంలోకి వెళ్లింది. అదే సమయంలో వృథా అవుతున్న నీటిని పరిరక్షించుకుంటామన్న నినాదంతో కావేరి తీరంలో కొత్తగా జలాశయంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు.

నో..నో..నో....
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న దృష్ట్యా, మేఘదాతులలో డ్యాం నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుందని భావించిన ప్రస్తుతం సీఎం యడియూరప్ప వేసిన లెక్కలు తప్పుయ్యాయి. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసిన యడియూరప్ప డ్యాం నిర్మాణ అనుమతుల విషయంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో యడ్డి ప్రయత్నాలకు, దూకుడుకు బ్రేక్‌ వేస్తూ అటవీ, పర్యావరణశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఇది యడ్డి సర్కారుకు షాక్కే. అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఆ శాఖకు వెళ్లిన అన్ని రకాల పరిశీలనలు తిరస్కరణకు గురయ్యాయి. మేఘదాతులో జలాశయం నిర్మాణం విషయంగా తమిళనాడుతో చర్చించాల్సిన అవసరం ఉందని, తమిళనాడు అనుమతి తప్పనిసరిగా అందులో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి ఉందని, తమిళనాడు అంగీకారం తదుపరి వచ్చే ఏకాభిప్రాయం మేరకు మేఘదాతులో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ శాఖ తేల్చింది. అలాగే, ఇప్పటికే పలుమార్లు తమిళనాడు ప్రభుత్వం ఆ డ్యాంకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఆశ్రయించి ఉన్నదని గుర్తు చేశారు.  4,096 హెక్టార్ల స్థలంలో డ్యాం నిర్మాణం అన్నది అసాధ్యం అని, ఈ దృష్ట్యా, కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం పళనిస్వామి గత కొన్ని నెలలుగా మేఘదాతుకు వ్యతిరేకంగా తీవ్ర చర్యలు చేపట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు, ఇక్కడకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మేఘాదాతులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు సమర్పించారు. అధికారవర్గాలు సైతం కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ముందు బలమైన వాదనల్ని వినిపించిన దృష్ట్యా, తాజాగా అందుకు తగ్గ ఫలితం దక్కినట్టు అయింది. కర్ణాటక ఆ డ్యాం నిర్మాణం కోసం మళ్లీ మళ్లీ కేంద్రం వద్ద ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని, తాజా ప్రకటన, పరిస్థితుల్ని పరిగణించి, మళ్లీ మేఘదాతు నినాదాన్ని కర్ణాటక చేతిలోకి తీసుకోకుండా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంకే నేత రాందాసు ఓ ప్రకటన సూచించారు.

మేఘదాతుతో అడ్డంకి ..
కావేరి తీరంలోని మేఘదాతు 64 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు తగ్గట్టుగా  జలాశయ నిర్మాణంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు. మేఘదాతులో జలాశయ నిర్మాణం జరిగి తీరుతుందని తొలుత సిద్ధరామయ్య, ఆ తదుపరి కుమారస్వామి సర్కారులు బల్లగుద్ది మరీ చెప్పాయి. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు వేగవంతం చేశాయి. మేఘదాతుల జలాశయం నిర్మించి, ఆ నీటిని బెంగళూరు అవసరాలకు ఉపయోగించబోతున్నట్టుగా ప్రకటించి, అందుకు తగ్గ పనులు వేగాన్ని పెంచారు. దీంతో తమిళనాట మేఘదాతులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, సమరాలు తప్పలేదు. అలాగే, ఈ డ్యాం నిర్మాణం కోసం కేంద్రం అనుమతి కోరే రీతిలో పలుమార్లు కర్ణాటక పాలకులు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత పాలకులు వదలిపెట్టిన పనుల్ని తన నేతృత్వంలో ముగించేందుకు తగ్గట్టుగా కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్ధమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement