సాక్షి, బెంగళూరు : కర్ణాటక బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు. గత రాత్రి తమ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారని తెలిపారు. ఎంత డబ్బు ఇస్తామన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారని చెప్పారు. అయితే, బీజేపీ ఆఫర్‌ను తమ ఎమ్మెల్యే తిప్పికొట్టారని తెలిపారు. తనకు డబ్బు అవసరం లేదని, ఎలాంటి కానుకలు వద్దని.. ఇలాంటి చర్యలతో ప్రలోభపెట్టొద్దని బీజేపీ నేతలను తమ ఎమ్మెల్యే హెచ్చరించారని కుమారస్వామి తెలిపారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని.. డబ్బు ఎరచూపి తమ ఎమ్మెల్యేలను లొంగదీసుకోలేరని తేల్చి చెప్పారు.
కాగా సీఎం కుమారస్వామి ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తాము ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే కుమారస్వామి బయటపెట్టాలని సవాల్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఇలాంటి ఆధారాలు లేని మాటలు సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ‘మేము ఆపరేషన్ కమలను నిలిపివేశాం. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్గత విభేదాల వల్ల కొంతమంది బయటకు వస్తున్నారు. విభేధాలు రాకుండా చూసుకోవడం ఆయన(కుమారస్వామి) విధి. ఇలాంటి ఆధారాలు లేని మాటలు మాట్లాడడం ఆయన ఆపాలి. మాకు 104 మంది ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆరోపణలు వదలి పాలనపై దృష్టిపెట్టాలి’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment