
సాక్షి, విజయవాడ : వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన టీడీపీ నాయకుడు దేవినేని ఉమాహేశ్వరావుకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని గొల్లపూడి కరకట్ట వరదలతో ముంపుకు గురైన విషయం తెలిసిందే. దీంతో ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన దేవినేని ఉమకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనను అక్కడి స్థానికులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. దీంతో దేవినేని అనుచరులు నిలదీసిన స్థానికులను, మహిళలపై బెదిరించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు.
టీడీపీ నేతల వరద రాజకీయాలు..
మరోవైపు వరద ముంపును రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా నిండని ప్రాజెక్టులు ఇప్పడు నీటితో నిండేసరికి కడుపు మండి టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తికి వరద వస్తుందని ముందుచూపు లేదా అంటూ ఎద్దేవా చేశారు. వరద తాకిడికి భయపడి చంద్రబాబు హైదరాబాదుకు పారిపోయారని, చిత్తశుద్ధి ఉంటే ఆయన తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు కోసం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు... ప్రజలకు, కార్మికులకు కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 75 రోజులలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 80శాతం హామీలను అమలు చేశారని అన్నారు.