సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయంగా ఎంతో ఉత్సాహంగా ఉండే కవిత ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తొలిసారి లోక్‌సభకు పంపిన నిజామాబాద్‌లో రెండోసారి కలిసి రాకపోవడంతో ఇక అటుదిక్కు చూడటం చూడా మానేశారు. ఈ నేపథ్యంలో ఆమె దారెటు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అంతేకాదు టీఆర్‌ఎస్ కార్యకర్తలనూ పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత ఎందుకు సైలెంట్ అయిపోయారు.? పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయని కవిత. మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రచారం చేస్తారా? కవితకు కేసీఆర్ ఏ పదవి ఇస్తారు.? అసలు కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటి.? అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ టీఆర్ఎస్‌లో స్తబ్దత ఆవహించింది. లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమితో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్ కూతురు కవిత ఓటమి చెందడం ఆమె భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. తరుచూ పర్యటనలు, కార్యక్రమాలతో సందడి చేసే కవిత ఈ మధ్య జిల్లా వైపు రావడం తగ్గించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫలితాలు రాకముందే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా. తన అత్తగారి పొతంగల్ గ్రామానికి ఓసారి, టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయిన సందర్భంగా మోపాల్కి మరోసారి, ఇటీవల ఇందూరు యూత్ వార్షికోత్సవం సందర్భంగా నగరానికి ఇంకోసారి ఇలా మూడు సార్లు మాత్రమే కవిత జిల్లాకు వచ్చారు. గ్రామ పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారానికి ఆమె రాలేదు. ఓటు మాత్రం వేసి వెళ్లారు. ఓటమి చెందినా ప్రజల్లోనే ఉంటానని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మోపాల్ లో వ్యాఖ్యానించారు. కానీ స్థానికంగా పర్యటించకపోవడం, ప్రజల్లోకి వెళ్లలేకపోవడం కార్యకర్తల్లో పార్టీలో నైరాశ్యం నింపుతోందని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఇటు ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడం వల్ల కూడా పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.
కవితకు మైనస్సే..
మరి కవిత దారెటు.? ఆమె రాజకీయ ప్లాన్ ఏంటి.? కేసీఆర్ ఏం బాధ్యతలు అప్పగించబోతున్నారనే అంశాలు నిజామాబాద్ జిల్లాలో కొంత కాలంగా హాట్ టాపిక్ అయ్యాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా.? అదే జరిగితే మళ్లీ ఎలా మొదలుపెట్టాలి.? ఎక్కడ స్టార్ట్ చేయాలి. అనే ప్రశ్నలు కవితను, సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పెద్దలను తొలుస్తున్నాయా..? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. పార్టీ అధిష్ఠానం కానీ కేడర్ కానీ ఎవరూ కవిత విషయంలో నోరు మెదపడం లేదు. సీఎం కూతురు కావడంతో పాటు ఆమెది అధిష్ఠానం స్థాయి కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడలేక పోతున్నారు. వాస్తవానికి తిరిగి ఏదైనా పెద్ద పదవిలోకి రావడం ఆమెకు కష్టమేమీ కాదు. కానీ ఏం జరిగినా కేసీఆర్ నిర్ణయం, కవిత అభీష్టం పైనే ఆధారపడి వుంటాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కవితకు మైనస్సే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అయినా నిజామాబాద్ జిల్లాకు వస్తారా.? ప్రచారం చేస్తారా.? అనేది చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఎమ్మెల్యలే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారా.? లేక సీఎం కేసీఆర్ కవితకు ఆదేశాలిస్తారా అనే చర్చ కేడర్ లో జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితకు రాజ్యసభ పదవి కట్టబెట్టి పెద్దల సభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డి ఎమ్మెల్సీ పదవి దాదాపుగా ఖాళీ అయినట్లే. కవితకు ఎంఎల్‌సి ఇస్తారా.? ఎంపీగా చేసిన ఎంఎల్‌సీ పదవిని తీసుకుంటారా? అసలు కవిత విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటి.? కవిత ఇంట్రెస్ట్ ఏమిటి.? తండ్రీ కూతుర్లిద్దరూ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా.? త్వరలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వస్తాయోమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment