సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్‌జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత 24 గంటల నుంచీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అంతకుముందు ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై వాజ్‌పేయికి చికిత్స అందించిన వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించడంతో అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి సహా కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఎయిమ్స్‌కు తరలివెళ్లి మాజీ ప్రధానిని పరామర్శించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు కూడా వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో పరామర్శించారు. గత కొన్నేళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న వాజ్‌పేయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో జూన్ 11న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరారు.
1924 డిసెంబర్ 25న జన్మించిన వాజ్‌పేయి మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారి భారత ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌పేయి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉన్నారు. 1998 నుంచి 1999 వరకూ 11 నెలలు, అటు తర్వాత 1998 నుంచి 2004 వరకూ దేశ ప్రధానిగా వ్యవహరించారు. 2015లో భారత ప్రభుత్వం వాజ్‌పేయికి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం అందించింది. నాలుగు దశాబ్ధాలపైబడి ఎంపీగా పదిసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకు రెండు సార్లు ఎంపికయ్యారు. క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యేంత వరకూ వాజ్‌పేయి యూపీలోని లక్నో నుంచి లోక్‌సభ సభ్యులుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment