
ద్వారక: చిన్న, మధ్య తరగతి వ్యాపారవేత్తలకు ఉపశమనం లభించేలా తాజాగా జీఎస్టీ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. దేశంలో వ్యాపారులపై అధికారుల వేధింపులు ఉండొద్దనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం ద్వారా 15 రోజుల ముందే దేశానికి దీపావళి కళ వచ్చిందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘గుజరాత్‌లో దీపావళి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
ముఖ్యంగా వ్యాపార వర్గం. తాజా జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈసారి దీపావళికి వీరంతా మరింత ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పత్రికల శీర్షికలు కూడా 15రోజుల ముందే దీపావళి అని పేర్కొన్నాయి’ అని తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడునెలల తర్వాత ఈ చట్టం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తామని ముందే చెప్పామని.. అన్నట్లుగానే ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రధాని అన్నారు.
‘ఈ మూడునెలల్లో నిర్వహణ, సాంకేతికత కొరత, నిబంధనలకు సంబంధించిన సమస్యలు, రేట్లకు సంబంధించిన ఫిర్యాదులు, వ్యాపార వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు జరిగాయి. దేశంలోని వ్యాపార వర్గం అధికారుల వేధింపులు, ఫైళ్లతో సమస్యలు ఎదుర్కోవద్దనేదే నా అభిమతం’ అని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి వచ్చిన సమాచారం, ఫిర్యాదుల ఆధారంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ మండలి సమావేశంలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ నిర్ణయాలను యావద్భారతం స్వాగతించిందన్నారు. ‘ప్రభుత్వంపై నమ్మకం ఉన్నపుడే నిర్ణయాల వెనక నిజాయితీ కనబడుతుంది. అప్పుడు ప్రజలు ఇబ్బందులను పక్కనపెట్టి మరీ ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఇప్పుడదే జరిగింది. పన్ను వ్యవస్థను సరళతరం చేయాలన్న మా ప్రయత్నాలకు మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
అదీ కాంగ్రెస్ మార్కు అభివృద్ధి
ఈ సమావేశంలో కాంగ్రెస్ అభివృద్ధిపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ‘మాధవ్ సింగ్ సోలంకీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి జామ్‌నగర్ వస్తున్న ముఖ్యమంత్రి అని పత్రికల్లో తొలిపేజీ ప్రకటనలు వచ్చేవి. కాంగ్రెస్ వాళ్ల అభివృద్ధి నమూనా అలా సంకుచితంగా ఉండేది. అభివృద్ధికి నిర్వచనం పూర్తిగా మారిపోయింది. మొదట్లో నేతలు చేతిపంపు పెట్టించి ఓట్లు అడిగేవారు. అభివృద్ధికి ప్రత్యామ్నాయం లేదు’ అని మోదీ పేర్కొన్నారు.
మత్స్యకారుల సాధికారత, పోర్టు ఆధారిత అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఓఖా–బేట్ ద్వారక మధ్య నాలుగులేన్ల కేబుల్ స్టేడ్ బ్రిడ్జి (2.3 కిలోమీటర్లు, 900 మీటర్ల సెంట్రల్ డబుల్ స్పాన్, రూ.962.43 కోట్ల వ్యయం) నిర్మాణానికి, సురేంద్రనగర్ జిల్లాలో హిరాసర్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు, ద్వారకాధీశాలయంలో మోదీ పూజలు చేశారు.
రూ.2,893 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్–రాజ్‌కోట్ మధ్యలో 47వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా మార్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పూర్తి ఆటోమేటిక్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. జీఎస్టీ ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. ‘మంచిగా సరళమైన పన్నుగా ఉండాల్సిన’గా జీఎస్టీని ‘క్లిష్టమైన భయంకరమైన పన్ను’గా మార్చారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా శనివారం విమర్శించారు.
సాంకేతిక అంతరం సరికాదు
దేశంలో సాంకేతిక అంతరాన్ని సహించబోమని.. సామాజిక సమానత్వం కోసం ఈ అంతరాన్ని తగ్గించాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ దిశగా యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఐఐటీ–గాంధీనగర్ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘నేటి పరిస్థితుల్లో దేశంలో సాంకేతిక అంతరం ఉండరాదు. కొందరికి సాంకేతికతపై పట్టు ఉంటుంది.
మరికొందరికి దీని గురించి అంతగా తెలియదు. ఈ అంతరం సామాజిక సామరస్యానికి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే దేశంలో ఈ అంతరాన్ని తగ్గించేందుకు మనమంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. డిజిటల్ సాక్షరత కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన ఉద్దేశాల్లో ఒకటని.. దీని ద్వారా సుపరిపాలన, పారదర్శకత తీసుకురావాలనేదే తమ ఉద్దేశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment