సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను ఎంపిక చేయడంతో భగ్గుమన్న విభేదాలు మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీ నుంచి సాగనంపేంత వరకు తీసుకొచ్చాయి. తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన శనివారం రామగుండం ఎన్టీపీసీలోని నివాసంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన తన వర్గీయులతో సమావేశమయ్యారు. మొదటి నుంచి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలతో వివేక్ సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం ‘బానిస సంకెళ్లు తెగాయి’ అని వ్యాఖ్యానించడం ద్వారా టీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన అధికారికంగా పార్టీకి రాజీనామా చేయలేదు.
కాగా టీఆర్‌ఎస్‌ను వీడితే వివేక్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరి పెద్దపల్లి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా వివేక్‌ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్ బీ ఫాంతో పాటు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం లేదని వివేక్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరే విషయమై సన్నిహితులతో చర్చలు జరిపిన వివేక్ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడు డిమాండ్లను ఆ పార్టీ నాయకత్వం ముందుంచగా.. ఓ అంశంపై విషయమై ఇరువర్గాల మధ్య స్పష్టత రావడం లేదని సమాచారం. రామగుండంలో సమావేశం ముగిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినా.. రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌ను కలిసిన తర్వాత వివేక్ పార్టీ ముందుంచిన డిమాండ్ల విషయంలో కేంద్ర నాయకత్వం నుంచి సానుకూల నిర్ణయం రాగానే ఆదివారం అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
కేసీఆర్ నమ్మించి గొంతుకోశారు : వివేక్
ఎన్టీపీసీలో జరిగే సమావేశానికి వచ్చిన తన వర్గీయుల అభిప్రాయాలు తీసుకున్న వివేక్ ప్రసంగిస్తూ ... కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి మోసం చేశారన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బానిస సంకెళ్లు తెగాయని , ఇక ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంచేశారు. కాగా తన ప్రసంగంలో ఇతర పార్టీల నుంచి పోటీ చేసే విషయాన్ని కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని కానీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం మరోసారి ముఖ్య నాయకులతో సమావేశమై నిర్ణయం వెల్లడిస్తారని భావించినప్పటికీ, అదేమీ లేకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు.
బీజేపీ అభ్యర్థిని ప్రకటించి హోల్డ్‌లో...
టీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బీజేపీ పెద్దపల్లి స్థానానికి శనివారం మధ్యాహ్నం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి జిల్లా నాయకుల వరకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ సీటును గోదావరిఖనికి చెందిన ఎస్.కుమార్‌కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా వివేక్‌కు బీజేపీలో దారులు మూసుకుపోయినట్టేనని అందరూ భావించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పందించి పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడి ఎస్.కుమార్ పేరును హోల్డ్‌లో ఉంచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం ధ్రువీకరించారు. అయితే రాత్రి వరకు వివేక్ ఆయనను కలవలేదని తెలిసింది. నేరుగా రాంమాధవ్‌తో మంతనాలు జరుపుతూ జాతీయ నాయకత్వం నుంచి తగిన హామీ తీసుకున్నాక బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో చేరికకు నో!
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్ధిగా మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ను ప్రకటించగా, ఆయన బీ ఫాంతో పాటు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, మంచిర్యాల, బెల్లంపల్లిలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌ను మార్చి వివేక్‌కు సీటిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తదితరులు వివేక్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా పార్టీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు బయటకు వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్‌గా కూడా మరోసారి పార్టీలో చేరేందుకు వివేక్ ససేమిరా అన్నట్లు సమాచారం. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకే అధికంగా ఉన్నట్లు భావిస్తూ ఇక్కడ ఫలితాల్లో తేడా వచ్చినా, ఢిల్లీలో చక్రం తిప్పొచ్చనే ఆలోచనతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
వివేక్‌పై మంత్రి, ఎమ్మెల్యేల ధ్వజం
పెద్దపల్లి టికెట్ విషయంలో కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారన్న వివేక్ మాటలపై టీఆర్‌ఎస్‌లో ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నాయకులు ఫైర్ అయ్యారు. వివేక్ సమావేశానికి పోటీగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖనిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ‘వంద రోజుల ఎమ్మెల్యే పాలన నివేదిక విడుదల’ పేరుతో చేసిన ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్‌ను టార్గెట్ చేసుకుని మంత్రి ఈశ్వర్, బాల్క సుమన్ ఘాటుగానే స్పందించడంతో పాటు వెంకటేశ్ నేతను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment