g. vivekanand
-
కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు: వివేక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను ఎంపిక చేయడంతో భగ్గుమన్న విభేదాలు మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీ నుంచి సాగనంపేంత వరకు తీసుకొచ్చాయి. తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన శనివారం రామగుండం ఎన్టీపీసీలోని నివాసంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన తన వర్గీయులతో సమావేశమయ్యారు. మొదటి నుంచి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలతో వివేక్ సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం ‘బానిస సంకెళ్లు తెగాయి’ అని వ్యాఖ్యానించడం ద్వారా టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన అధికారికంగా పార్టీకి రాజీనామా చేయలేదు. కాగా టీఆర్ఎస్ను వీడితే వివేక్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరి పెద్దపల్లి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా వివేక్‌ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్ బీ ఫాంతో పాటు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం లేదని వివేక్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరే విషయమై సన్నిహితులతో చర్చలు జరిపిన వివేక్ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడు డిమాండ్లను ఆ పార్టీ నాయకత్వం ముందుంచగా.. ఓ అంశంపై విషయమై ఇరువర్గాల మధ్య స్పష్టత రావడం లేదని సమాచారం. రామగుండంలో సమావేశం ముగిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినా.. రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌ను కలిసిన తర్వాత వివేక్ పార్టీ ముందుంచిన డిమాండ్ల విషయంలో కేంద్ర నాయకత్వం నుంచి సానుకూల నిర్ణయం రాగానే ఆదివారం అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కేసీఆర్ నమ్మించి గొంతుకోశారు : వివేక్ ఎన్టీపీసీలో జరిగే సమావేశానికి వచ్చిన తన వర్గీయుల అభిప్రాయాలు తీసుకున్న వివేక్ ప్రసంగిస్తూ ... కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బానిస సంకెళ్లు తెగాయని , ఇక ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంచేశారు. కాగా తన ప్రసంగంలో ఇతర పార్టీల నుంచి పోటీ చేసే విషయాన్ని కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని కానీ ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం మరోసారి ముఖ్య నాయకులతో సమావేశమై నిర్ణయం వెల్లడిస్తారని భావించినప్పటికీ, అదేమీ లేకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించి హోల్డ్‌లో... టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బీజేపీ పెద్దపల్లి స్థానానికి శనివారం మధ్యాహ్నం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి జిల్లా నాయకుల వరకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ సీటును గోదావరిఖనికి చెందిన ఎస్.కుమార్‌కు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా వివేక్‌కు బీజేపీలో దారులు మూసుకుపోయినట్టేనని అందరూ భావించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పందించి పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడి ఎస్.కుమార్ పేరును హోల్డ్‌లో ఉంచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం ధ్రువీకరించారు. అయితే రాత్రి వరకు వివేక్ ఆయనను కలవలేదని తెలిసింది. నేరుగా రాంమాధవ్‌తో మంతనాలు జరుపుతూ జాతీయ నాయకత్వం నుంచి తగిన హామీ తీసుకున్నాక బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికకు నో! కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్ధిగా మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ను ప్రకటించగా, ఆయన బీ ఫాంతో పాటు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, మంచిర్యాల, బెల్లంపల్లిలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌ను మార్చి వివేక్‌కు సీటిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా తదితరులు వివేక్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా పార్టీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు బయటకు వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్‌గా కూడా మరోసారి పార్టీలో చేరేందుకు వివేక్ ససేమిరా అన్నట్లు సమాచారం. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకే అధికంగా ఉన్నట్లు భావిస్తూ ఇక్కడ ఫలితాల్లో తేడా వచ్చినా, ఢిల్లీలో చక్రం తిప్పొచ్చనే ఆలోచనతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వివేక్‌పై మంత్రి, ఎమ్మెల్యేల ధ్వజం పెద్దపల్లి టికెట్ విషయంలో కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారన్న వివేక్ మాటలపై టీఆర్ఎస్లో ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నాయకులు ఫైర్ అయ్యారు. వివేక్ సమావేశానికి పోటీగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖనిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ‘వంద రోజుల ఎమ్మెల్యే పాలన నివేదిక విడుదల’ పేరుతో చేసిన ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్‌ను టార్గెట్ చేసుకుని మంత్రి ఈశ్వర్, బాల్క సుమన్ ఘాటుగానే స్పందించడంతో పాటు వెంకటేశ్ నేతను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
హెచ్‌సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్‌లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
మాజీ ఎంపీ వివేక్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. తీర్పును స్వాగతిస్తున్నాము : అజారుద్దీన్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారన్నారు. -
వివేక్ అనర్హుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఉత్తర్వులు జారీచేయడం సంచలనం సృష్టించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ఎన్నిక కూడా చెల్లదని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏసీబీ చార్జిషీటులో శేష్‌నారాయణ్ నిందితునిగా ఉన్నందున కార్యదర్శి పదవికి ఆయన అర్హుడు కాదని అంబుడ్స్‌మన్ తేల్చారు. వారిని పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శుల కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతవరకు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు. -
హైదరాబాద్ జట్టు కోచ్‌గా అరుణ్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక మాజీ క్రికెటర్ జగదీశ్ అరుణ్ కుమార్ హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. 2017–18 సీజన్ కోసం అరుణ్‌ను ఎంపిక చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్ ప్రకటించారు. గత ఏడాది భరత్ అరుణ్ హైదరాబాద్‌కు కోచ్‌గా పని చేశారు. చక్కటి ప్రదర్శన కనబర్చిన జట్టు నాకౌట్ దశకు చేరడంతో పాటు ‘ఎలైట్’ గ్రూప్‌లోకి ప్రమోట్ అయింది. అయితే భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ ఎంపిక కావడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. రికార్డు ఘనం...: కర్ణాటక తరఫున దాదాపు పదిహేనేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అరుణ్ కుమార్ 109 మ్యాచ్‌లలో 7,208 పరుగులు చేశారు. ఐపీఎల్ తొలి సీజన్లో బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2008లో ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా మారిన అరుణ్, భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరుణ్ శిక్షణలోనే కర్ణాటక జట్టు వరుసగా రెండేళ్లు (2013–14, 2014–15) రంజీ, ఇరానీ, విజయ్ హజారే ట్రోఫీలలో విజేతగా నిలిచిన అరుదైన ‘ట్రిపుల్’ను సాధించింది. ఐపీఎల్–10 సీజన్లో అరుణ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు. -
సీఎం రేసులో లేను: ఎంపీ వివేక్
మంథని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ జి.వివేక్ తెలిపారు. సీఎం పదవి కోసమే తాను టీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం చేస్తున్నారని, పదవుల కోసం ఏనాడూ ఆరాటపడ లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసిన వారిని తెలంగాణ ఫ్రీడం ఫైటర్స్‌గా గుర్తించాలని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొలువుదీరే ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ ఎన్నోసార్లు పదవీ త్యాగం చేసిన కేసీఆర్ లాంటి వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యమంలో సరైన సమయంలో త్యాగం చేస్తేనే ఫలితం లభిస్తుంది కానీ.. స్వప్రయోజనాల కోసం చేస్తే త్యాగాలు చేస్తే లాభం ఉండదని మంత్రి శ్రీధర్‌బాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. -
కిరణ్, బొత్సలపై ఎంపీ వివేక్ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై పెద్దపల్లి ఎంపీ వివేక్ శుక్రవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. వారిద్దరిని పదవులు నుంచి డిస్మిస్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమంపై వారిరువురు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం కిరణ్ తెలంగాణ ద్రోహి అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టే వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని వివేక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ వివేక్ తెలిపారు.