హైదరాబాద్ జట్టు కోచ్‌గా అరుణ్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక మాజీ క్రికెటర్ జగదీశ్ అరుణ్ కుమార్ హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. 2017–18 సీజన్ కోసం అరుణ్‌ను ఎంపిక చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్ ప్రకటించారు. గత ఏడాది భరత్ అరుణ్ హైదరాబాద్‌కు కోచ్‌గా పని చేశారు. చక్కటి ప్రదర్శన కనబర్చిన జట్టు నాకౌట్ దశకు చేరడంతో పాటు ‘ఎలైట్’ గ్రూప్‌లోకి ప్రమోట్ అయింది. అయితే భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ ఎంపిక కావడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది.
రికార్డు ఘనం...: కర్ణాటక తరఫున దాదాపు పదిహేనేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అరుణ్ కుమార్ 109 మ్యాచ్‌లలో 7,208 పరుగులు చేశారు. ఐపీఎల్ తొలి సీజన్‌లో బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2008లో ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా మారిన అరుణ్, భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరుణ్ శిక్షణలోనే కర్ణాటక జట్టు వరుసగా రెండేళ్లు (2013–14, 2014–15) రంజీ, ఇరానీ, విజయ్ హజారే ట్రోఫీలలో విజేతగా నిలిచిన అరుదైన ‘ట్రిపుల్’ను సాధించింది. ఐపీఎల్–10 సీజన్‌లో అరుణ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు.