
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది.
తీర్పును స్వాగతిస్తున్నాము : అజారుద్దీన్
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment