సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే సంస్థను నడిపిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ చెప్పుకొచ్చారు. మంగళవారం హెచ్‌సీఏ కార్యాలయంలో అంబుడ్స్‌మన్ సమావేశం జరిగింది. సమావేశం అజెండాలో ప్రధానాంశమైన సెక్రటరీ శేష్ నారాయణపై వేటు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు అవమానం తదితర విషయాలపై వివేక్ మీడియాతో మాట్లాడారు.
రోజూ రాత్రి ఫోన్ చేస్తాడు : అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి పోస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన శేష్ నారాయణ భవితవ్యంపై అంబుడ్స్‌మన్ కమిటీ చర్చించింది. అతనిపై హెచ్‌సీఏ పాలకమండలి విధించిన సస్పెన్షన్ సమర్థనీయమా, కాదా అనే విషయాన్ని అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నిర్ధారిస్తారు. కాగా, మంగళవారం నాటి భేటీ తుది నిర్ణయం ప్రకటించకుండానే ముగిసింది. శేష్ నారాయణ సస్పెన్షన్‌పై తీర్పు జనవరి 20కి వాయిదా పడింది. ఇదిలాఉంటే సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న శేష్ నారాయణ మంచి మిత్రుడని హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ అన్నారు. ‘రోజూ రాత్రి 11 గంటలకు శేష్ నాకు ఫోన్ చేస్తాడ’ని తెలిపారు.
అందుకే అజార్‌ను రానివ్వలేదు : భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ ఆఫీసులోకి రానీయకుండా అడ్డుకున్న వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై వివేక్ వివరణ ఇచ్చారు. ‘‘నేషనల్ క్రికెట్ క్లబ్ కార్డు చూపించమని అడిగితే అజార్ చూపించలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్లుగా కనీసం రికార్డుల్లోకూడా లేదు. అందుకే అతన్ని హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించలేదు. అయితే అజార్ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. క్రికెట్‌లో సమస్యలు చెప్పాలని ఆయనను కోరాం’’ అని వివేక్ వివరించారు. ‘‘క్రికెట్‌లో ఎ, బి, సి, డిలు కూడా తెలియని వ్యక్తులు హెచ్‌సీఏకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు’ అని వివేక్‌పై అజారుద్దీన్ మండిపడిన సంగతి తెలిసిందే.
క్రికెట్‌ను ఎవరైనా నడిపించొచ్చు : క్రికెట్ కమిటీల విషయంలో జస్టిస్ లోథా కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలుచేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ చెప్పారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు నిధులు రాలేదని, ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే బండిని నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)తో హెచ్‌సీఏకి ఎలాంటి విబేధాలు లేవని, క్రికెట్‌ను ఎవరైనా నడిపించుకోవచ్చని, అయితే హెచ్‌సీఏకు పోటీ సంఘాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని బీసీసీఐ స్పష్టం చేసిందని వివేక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment