సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేకానంద్‌కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్ కొనసాగడానికి వీల్లేదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు వివేక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, అందువల్ల ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ అంబుడ్స్‌మన్ ముందు భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, బాబూరావు తదితరులు ఫిర్యాదులు దాఖలు చేశారు.
విచారణ జరిపిన అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఈ ఏడాది మార్చి 8న తీర్పునిస్తూ... విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతూ, అదే కంపెనీతో ఒప్పందం ఉన్న హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తేల్చారు. అందువల్ల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి మార్చి 15న అంబుడ్స్‌మన్ తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను మళ్లీ సవాలు చేస్తూ అంబుడ్స్‌మన్ ముందు ఫిర్యాదుదారులైన అజహరుద్దీన్, బాబూరావులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరిస్తూ... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది.
తీర్పును స్వాగతిస్తున్నాం...
హైకోర్టు ఉత్తర్వులపై పిటిషనర్ బాబూరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ పనితీరు సక్రమంగా లేకనే బీసీసీఐ నుంచి నిధులు రావడం లేదని... వివేక్ వర్గానికి చిత్తశుద్ధి ఉంటే లోధా కమిటీ సిఫారసులను అనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగవద్దు!
Published Wed, Jun 13 2018 1:12 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment