ఇంకా నియమావళిని సవరించలేదు
లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడం లేదు
హెచ్‌సీఏపై హైకోర్టుకు బీసీసీఐ ఫిర్యాదు
తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల అమలు విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ఉమ్మడి హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. లోధా కమిటీ సిఫారసుల మేరకు హెచ్‌సీఏ తమ బైలాస్ (నియమావళి)ను సవరించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఆ పని చేయలేదని బీసీసీఐ తరఫు న్యాయవాది ప్రియదర్శన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో హెచ్‌సీఏ ఒక్కోసారి ఒక్కో రకంగా వ్యవహరిస్తోందన్నారు. ఒకసారి బైలాస్‌ను సవరించామని, మరోసారి సవరిస్తున్నామని చెబుతోందని వివరించారు. హెచ్‌సీఏ పాలకవర్గం విషయంలో అంతర్గత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ నిమిత్తం హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని బీసీసీఐ కోరుతోందన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ సంఘాల్లో సంస్కరణల నిమిత్తం పలు సిఫారసులు చేసిందని, వాటిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో సైతం అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది గోవింద రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని అభ్యర్థిస్తూ బీసీసీఐ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అభ్యర్థనకు సంబంధించి గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న ధర్మాసనం గురువారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ ఇన్‌చార్జి అధ్యక్షుడి తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్ అవసరం లేదని, పరిశీలకుడి నియామకం సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ వెంకటరామారెడ్డి, జస్టిస్ జగన్నాథరావుల పేర్లను ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనకు వారు అంగీకరిస్తారో లేదోనని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో హెచ్‌సీఏ అంతర్గత కలహాలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంది. అటు తరువాత పలువురు న్యాయవాదులు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్ నియామకం అవసరం లేదన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో హెచ్‌సీఏ పాత్ర నామమాత్రమని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.