
సాక్షి, లక్కిరెడ్డిపల్లె: ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తానని, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కోనంపేట పీహెచ్‌సీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన కేసులో లక్కిరెడ్డిపల్లె కోర్టు వాయిదాకు బుధవారం ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ సంకల్పయాతల్రో సాగుతున్నారన్నారు.
ప్రజలకు ఉపయోగపడే విధంగా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి, వారికి మేలు చేస్తానన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు భయపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారంటూ దొంగచాటుగా మీడియాలో ప్రచారం చేస్తూ.. అందులో తన పేరు కూడా చేర్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. తనపై అధికార టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రతి సారీ వివరణ ఇచ్చుకోవాలంటే సిగ్గుగా ఉందన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.