Rayachoti MLA
-
ఈకేవైసీ నమోదుపై అపోహలు వద్దు - ప్రభుత్వ చీఫ్‌విప్
సాక్షి, రాయచోటి : ఈకేవైసీ చేయకపోవడం వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకమూ దూరం కాదు. ఇప్పటికిప్పుడు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈకేవైసీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. నమోదు కోసం ప్రజలు ఒక్కసారిగా వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చీఫ్‌విప్ ఆవేదనను వ్యక్తం చేశారు. కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వ విధానాలపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారంటూ మండిపడ్డారు. రోజుల తరబడి చిన్నబిడ్డలతో కలిసి క్యూలో నిరీక్షించాల్సి రావడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితులపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈనెల చివరికల్లా ఈకేవైసీ చేసుకోని వారికి రేషన్ కార్డులు, రేషన్ రద్దు అవుతాయన్న ప్రచారాన్ని జేసీ కొట్టి పారేశారని చెప్పారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఈకేవైసీ నమోదు చేసుకోనంత మాత్రాన కార్డులు రద్దు కావన్నారు. గల్ఫ్, ఇతర దేశాలు, ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ప్రజలకు తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే ప్రభుత్వం వార్డులు, వీధులలో అదనపు యంత్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తుందే తప్పా ఇబ్బంది పెట్టదన్నారు. రెవెన్యూ శాఖ, డీలర్లు వారి వద్దకు వచ్చిన ప్రజలకు అవగాహనను కల్పించాలన్నారు. ఈకేవైసీ సాకుగా చూపి అర్హులకు రేషన్ ఇవ్వకపోవడం, రేషన్ కార్డులు రద్దయ్యాయని చెబుతున్న డీలర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఆధార్ కేంద్రాన్ని సందర్శించిన చీఫ్‌విప్ రాయచోటి ప్రధాన పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్‌ను ఆదివారం ఉదయం చీఫ్‌విప్ సందర్శించారు. ఈకేవైసీ నమోదు విషయంపై అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రాయచోటిలో రెండు ఆధార్ కేంద్రాల ద్వారా రోజుకు వంద మందికి అప్డేట్ చేస్తే లక్షమంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారని, వారందరికీ ఈకేవైసీ అప్డేట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించాలన్నారు. మరోమారు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు రియాజుర్ రహెమాన్ కూడా పాల్గొన్నారు. -
నా పేరు కూడా చేర్చడం దుర్మార్గం
సాక్షి, లక్కిరెడ్డిపల్లె: ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తానని, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కోనంపేట పీహెచ్సీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన కేసులో లక్కిరెడ్డిపల్లె కోర్టు వాయిదాకు బుధవారం ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ సంకల్పయాతల్రో సాగుతున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి, వారికి మేలు చేస్తానన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు భయపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారంటూ దొంగచాటుగా మీడియాలో ప్రచారం చేస్తూ.. అందులో తన పేరు కూడా చేర్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. తనపై అధికార టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రతి సారీ వివరణ ఇచ్చుకోవాలంటే సిగ్గుగా ఉందన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. -
రుణమాఫీ చేయాల్సిందే
రాయచోటి : ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు రైతు, డ్వాక్రా రుణాలు రూ.లక్షా రెండు వేల కోట్లు ఉన్నాయని, తక్షణం వాటిని మాఫీ చేయాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు, డ్వాక్రా మహిళలను వంచించినట్లేన ని ఆయన అన్నారు. రాయచోటిలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రుణాలమాఫీ కోసం కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతటితో ఆగక విడతల వారిగా మాఫీ చేస్తామంటూ రైతులను అయోమయానికి గురి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత రైతులకు తొలుత రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అందాల్సిన పంటనష్ట పరిహారం, పంటల బీమా సైతం రుణమాఫీకే జమ చేస్తామనడం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. దీన్ని బట్టి రైతులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ లో చర్చించాలని కోరితే అందుకు ప్రభుత్వం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గతంలో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో వాటిని రెన్యువల్ చేసుకోలేకపోయారన్నారు. మాఫీతో తాకట్టుపెట్టిన బం గారు తాళిబొట్లను తెచ్చుకోవచ్చని ఆశించారన్నారు. ఇప్పుడు ఉన్నపళంగా నగలు వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు పంపడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు ప్రభుత్వం స్పందించి వేలం పాటలను నిలిపివేయాలని కోరారు. -
రైతులను మోసగించిన చంద్రబాబు
కడప అగ్రికల్చర్ : ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రైతులు పంటల బీమా కోల్పోతున్నారని, రుణమాఫీ వర్తించడం లేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్లో మాట్లాడుతూ పంటల బీమా వివరాలను తాను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గాలివీడు మండలంలో హెక్టారుకు రూ.1,300 బీమా దక్కిందని, రామాపురం మండలానికి రూ.5,400 కేటాయించారని తెలిపారు. రాయచోటి పరిధిలో మరో నాలుగు మండలాలకు బీమా వర్తించలేదన్నారు. పంటల బీమా లోప భూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. అరకొరగా ఆదుకోనున్న పంటల బీమా సైతం ఈ మారు రైతన్నలకు అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి బీమా వర్తించేదని, రుణమాఫీ కారణంగా ఆ అవకాశాన్ని రైతులు చేజార్చుకున్నారని వివరించారు. రుణమాఫీ అయితే కొత్త రుణాలు తీసుకోవడంతో బీమా వర్తించేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతు రాజులా జీవించాడని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సోనియా.. క్విట్ ఇండియా
స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీషు వారిని తరిమికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం మొదలైందని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న సోనియాగాంధీని తరిమికొట్టేందుకు మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని పలువురు నాయకులు, సమైక్యవాదులు పిలుపునిచ్చారు. కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : క్విట్ ఇండియా అంటూ విదేశీయురాలైన సోనియా గాంధీని దేశం నుంచి సాగనంపాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆయన మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, హఫీజుల్లా కాల్టెక్స్, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లతో కలిసి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు తమ పదవుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, వీరు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తథ్యమన్నారు. ఏకే ఆంటోని నేతృత్వంలో గతంలో పలు స్కామ్‌లపై వేసిన కమిటీలు సరైన నివేదికలు ఇవ్వలేదన్నారు. నేడు సమైక్యాంధ్రపై వేసిన హై లెవెల్ కమిటీ కూడా అదే రీతిలో పయనిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలోగానీ, దేశంలోగానీ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఆంగ్లేయులు పాలించిన దానికంటే సోనియా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీబీఐ కేసులకు భయపడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్ర విభజన దోషులు సోనియా, చంద్రబాబులేనని, ప్రజలు వీరికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. కనుసైగతో ఎంపీలను శాసిస్తున్నారు: ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పార్లమెంటులో కేంద్ర మంత్రులు, ఎంపీలను సోనియాగాంధీ కనుసైగతో శాసిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. 1950 నుంచి తెలంగాణ ఉద్యమం ఉందని, ఎన్ని ఉద్యమాలు జరిగినా అప్పటి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచారన్నారు. జగన్‌కు అడ్డుకట్ట వేయడం, రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలా విడదీస్తే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయో ఆలోచించి, తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపు ధోరణిలో విభజన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఒకేరోజు హడావుడిగా మూడు సమావేశాలు నిర్వహించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివారావు, పురంధేశ్వరి, పల్లంరాజులు సీమాంధ్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. చంద్రబాబు సమైక్యమా? తెలంగాణమా? తేల్చి చెప్పకపోతే ఆయన ఏ యాత్ర చేసినా ప్రజలు చెప్పులు, రాళ్లతో కొట్టి తరుముతారన్నారు. వైఎస్ కల నేరిందని దిగ్విజయ్‌సింగ్ చెప్పడం దారుణమన్నారు. వైఎస్ ఉండి ఉంటే అసలు తెలంగాణ ప్రస్తావన వచ్చేదా? అని అమర్నాథరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నరేంద్రమోడీని బాలకృష్ణ కలువడంలో గల ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. గౌరవంగా తప్పుకోకపోతే రోశయ్యకు పట్టిన గతే : రఘురామిరెడ్డి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని సోనియాగాంధీ ఆయన కుర్చీ లాగేసిందని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా గౌరవంగా తప్పుకోకపోతే రోశయ్యకు పట్టిన గతే ఆయనకూ పడుతుందని హెచ్చరించారు. 33 ఎంపీ సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు సోనియా ఇచ్చే బహుమతి ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. 60 సంవత్సరాలుగా సీమాంధ్రులు హైదరాబాదులో తమ పెట్టుబడులు, ఆదాయం పెట్టారని, ఇప్పటికప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్లాలన్నారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ నేడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మునిగే పడవ అని తెలుసుకుని బీజేపీతో మళ్లీ కలవడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఏ ధ్యేయంతో టీడీపీని స్థాపించారో అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ నడుస్తోందన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటును బహిష్కరించి బిల్లు పెట్టకుండా అడ్డుకోవాలన్నారు. ఒకరిని తొక్కి, మరొకరిని అందలమెక్కించడానికే.. -ఎమ్మెల్యే కొరముట్ల వైఎస్ జగన్‌ను అణగదొక్కి రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికే దుష్ట శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని విభజిస్తున్నాయని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ పాలనలో ఒక వెలుగు వెలిగిన రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దుర్మార్గమన్నారు. విడిపోవడానికి సాగునీరు, తాగునీరు, హైదరాబాద్ రాజధాని వంటి ఎన్నో సమస్యలు ముడిపడి ఉన్నాయన్నారు. ఒక రాత్రిలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఉలిక్కి పడిందన్నారు. సోనియా నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని సూచించారు. దేశంలో ఏ భాష మాట్లాడే వారికి ఆ రాష్ట్రం ఉందని, తెలుగు మాట్లాడే వారికి మాత్రం రెండు రాష్ట్రాలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని మాట్లాడటం అన్యాయమన్నారు. -
సమైక్యం కోసం ప్రత్యక్షపోరాటం
సాక్షి, కడప: రాష్ట్రవిభజన ప్రక్రియను ముందే పసిగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు తమ పదవులకు జూలైలోనే రాజీనామాలు చేసి నిరసన తెలిపారు. రాజీనామాలపై మరో ఆలోచన లేకుండా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాలను పంపారు. అయినన్పటికీ కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయనున్నట్లు ఏఐసీసీ అధికారప్రతినిధి అజయ్‌మాకెన్, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఈనెల 30న ప్రకటించారు. దీంతో మరోసారి తమ పదవులకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. జూలై 31 నుంచి జిల్లా వాసులు సమైక్య ఉద్యమం పేరుతో రోడ్డెక్కారు. దీంతో సమైక్యరాష్ట్రం కోసం జిల్లాకు చెందిన నేతలు పలురకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్‌పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆరురోజుల పాటు కలెక్టరేట ఎదుట ఆమర ణ నిరాహారదీక్ష చేశారు. ఈ నెల 10న నిత్యానందరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలుగుప్రజలపై కాంగ్రెస్‌పార్టీ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలిపారు. ప్రధానపార్టీలకు చెందిన పార్టీ అధినేతల్లో రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్రెడ్డి కావడంతో జిల్లా వాసులతో పాటు సీమాంధ్ర ప్రజలంతా జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈక్రమంలో సమైక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డిలు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. విభజనపై కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్కచేయమని శ్రీకాంత్, రవీంద్రనాథరెడ్డిలు తెలిపారు. ఈ ఆమరణదీక్షను జేఏసీ నేతలు కూడా స్వాగతించారు. వైసీపీ నేతల ఆమరణదీక్ష నిర్ణయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. సమైక్య రాష్ట్రం కోసం పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడం, ఇప్పుడు ఆమరణ దీక్షలకు సిద్ధపడటంతో ప్రజల్లోకి తాము ఎలా వెళ్లాలని ఆలోచనలో పడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం లేదని వారు కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని ప్రజల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. టీడీపీ చెందిన ఎంపీ సీఎం రమేశ్‌తో లింగారెడ్డి కూడా ఉద్యమంలో పాల్గొనాలని జిల్లా వాసులు డిమాండ్ చే స్తున్నారు. సీమ కష్టాలు గుర్తెరిగి ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులను త్యజిస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలను చూసి ఉద్యమం ఎలా సాగుతుందో, అధికార, ప్రతిపక్షాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ఆలోచించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.