
రైతులను మోసగించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రైతులు పంటల బీమా కోల్పోతున్నారని, రుణమాఫీ వర్తించడం లేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కడప అగ్రికల్చర్ : ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రైతులు పంటల బీమా కోల్పోతున్నారని, రుణమాఫీ వర్తించడం లేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ పంటల బీమా వివరాలను తాను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గాలివీడు మండలంలో హెక్టారుకు రూ.1,300 బీమా దక్కిందని, రామాపురం మండలానికి రూ.5,400 కేటాయించారని తెలిపారు. రాయచోటి పరిధిలో మరో నాలుగు మండలాలకు బీమా వర్తించలేదన్నారు.
పంటల బీమా లోప భూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. అరకొరగా ఆదుకోనున్న పంటల బీమా సైతం ఈ మారు రైతన్నలకు అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి బీమా వర్తించేదని, రుణమాఫీ కారణంగా ఆ అవకాశాన్ని రైతులు చేజార్చుకున్నారని వివరించారు. రుణమాఫీ అయితే కొత్త రుణాలు తీసుకోవడంతో బీమా వర్తించేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతు రాజులా జీవించాడని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.