
రుణమాఫీ చేయాల్సిందే
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు రైతు, డ్వాక్రా రుణాలు రూ.లక్షా రెండు వేల కోట్లు ఉన్నాయని, తక్షణం వాటిని మాఫీ చేయాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాయచోటి : ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు రైతు, డ్వాక్రా రుణాలు రూ.లక్షా రెండు వేల కోట్లు ఉన్నాయని, తక్షణం వాటిని మాఫీ చేయాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు, డ్వాక్రా మహిళలను వంచించినట్లేన ని ఆయన అన్నారు. రాయచోటిలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రుణాలమాఫీ కోసం కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతటితో ఆగక విడతల వారిగా మాఫీ చేస్తామంటూ రైతులను అయోమయానికి గురి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
వెనుకబడిన రాయలసీమ ప్రాంత రైతులకు తొలుత రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అందాల్సిన పంటనష్ట పరిహారం, పంటల బీమా సైతం రుణమాఫీకే జమ చేస్తామనడం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. దీన్ని బట్టి రైతులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ లో చర్చించాలని కోరితే అందుకు ప్రభుత్వం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు గతంలో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో వాటిని రెన్యువల్ చేసుకోలేకపోయారన్నారు. మాఫీతో తాకట్టుపెట్టిన బం గారు తాళిబొట్లను తెచ్చుకోవచ్చని ఆశించారన్నారు. ఇప్పుడు ఉన్నపళంగా నగలు వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు పంపడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు ప్రభుత్వం స్పందించి వేలం పాటలను నిలిపివేయాలని కోరారు.