
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబేనని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పోలవరం విషయంతో పాటు ఏపీకి చెందిన ప్రధాన అంశాల్లోనూ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పోలవరం అంశంపై చిట్‌చాట్‌లో బాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. స్పష్టమైన ప్రకటనలు చేయండానే ఏపీ సీఎం చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ కాంట్రాక్ట్‌ల ప్రాజెక్టుగా మార్చిందని గడికోట దుయ్యబట్టారు. ఇందులో చంద్రబాబే ప్రధాన కాంట్రాక్టర్ కాగా, రాయపాటి సాంబశివరావు, మరికొందరు టీడీపీ నేతలు ఇతర కాంట్రాక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. విచారణ చేపడితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని, స్టేలు తెచ్చుకుంటూ నిజాలను భూస్థాపితం చేయడం చంద్రబాబుకు అలవాటేనని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
- పోలవరం అంశంపై చిట్‌చాట్‌లో చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. తూతూ మంత్రంగా కాపు రిజర్వేషన్‌పై ప్రకటన చేశారు.
- స్పష్టమైన ప్రకటనలు చేయకుండానే విదేశాలకు చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారు
- పోలవరం ఓ కల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు గుండెకాయ అని చెప్పిన వ్యక్తి ప్రస్తుతం ఏ తీరుగా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారు
- 2018లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న బాబు హామీలేమయ్యాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు దండగ అంటున్నారు
- పోతిరెడ్డిపాడును 50 క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్‌ఆర్‌ది కాగా, గాలేరు-నగరి పనులను మధ్యలోనే ఆపేసిన వ్యక్తి చంద్రబాబు కాదా?
- చరిత్రలో ఏరోజూ చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదు. 1994లో రెండు హామీలతో ఎన్నికలకు వెళ్లారు. రూ.2కు కిలో బియ్యం, మద్య నిషేధమంటూ చెప్పారు. ఏదీ చేయలేదు. కాగా, 1999లో మహిళలకు కేజీ టూ పీజీ ఉచిత చదువు అన్నారు. అధికారంలోకొచ్చాక మంగళం పాడారు చంద్రబాబు
- 2014లో సీఎం అయ్యాక ఐదు సంతకాలు చేశారు. కానీ ఆయన చెప్పినట్లుగా రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు. బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. అదీలేదు.
- అప్పటికప్పుడు హడావుడిగా ఏదో ఒకటి ప్రజలకు చెప్పి ఊహల్లో బతికేయడం చంద్రబాబుకు అలవాటు
స్టేలతో నిజాలను భూస్థాపితం చేయడం బాబుకు అలవాటే