
చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్
చంద్రబాబుది దోపిడీ ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: చంద్రబాబుది దోపిడీ ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును తానే కట్టానని చంద్రబాబు చెప్పుకోవడం శోచనీయమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడింది చంద్రబాబేనని చెప్పారు. పోలవరంకు జాతీయ హోదా రాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశా సీఎంలతో కలిసి కుట్ర చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
మహానేత వైఎస్సార్ చనిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నీరు గార్చారని ఆరోపించారు. పోలవరం కుడి కాలువే పట్టిసీమ ప్రాజెక్టు అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే వైఎస్సార్ హయాంలోనే అత్యధిక ప్రాజెక్టులు పూర్తయినట్టు ఒప్పుకున్నారని వెల్లడించారు.
వైఎస్సార్ 85 ప్రాజెక్టులు మొదలుపెట్టి 41 ప్రాజెక్టులు ప్రారంభించారు. మిగిలినవి 60 శాతం వరకు పూర్తి చేశారు. వైఎస్సార్ హయాంలోనే ముచ్చుమర్రి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టిన ఆర్థర్ కాటన్ ను మనం పూజిస్తాం, ఇన్ని ప్రాజెక్టులు కట్టిన వైఎస్సార్ దేవుడు కదా అని ప్రశ్నించారు. బహిరంగ వేదికల మీద వైఎస్సార్ ను ఎందుకు తిట్టిస్తున్నారని నిలదీశారు. ఆడలేక మద్దెల ఓడు.. చందంగా తమపై నిందలు వేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు ధైరముంటే ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.