
‘కాపులకు రిజర్వేషన్లు వస్తున్నాయి. పండుగ చేసుకోండంటూ’
వైఎస్సార్ జిల్లా : కాపు రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడింది చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం ఎల్లో మీడియాలో డిబేట్లు నిర్వహించి ప్రతిపక్షంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘కాపులకు రిజర్వేషన్లు వస్తున్నాయి. పండుగ చేసుకోండంటూ’ ప్రచారం చేసుకుంది చంద్రబాబు కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎకిల నాయుడులను, మైనార్టీలను బీసీల్లో చేర్చిన మహానేత వైఎస్సార్ ఎప్పుడూ కూడా ప్రచారం చేసుకోలేదన్నారు. చంద్రబాబు మాత్రం.. ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెడుతూ, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.