సాక్షి, బెంగళూర్ : మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అనేకల్ పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు.
‘‘బీజేపీ నాకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం. రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. మున్ముందు కూడా పార్టీ కోసం పని చేస్తా’’ అని గాలి జనార్దన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జనార్దన్ చెప్పారు. మైసూర్ చాముండీ ఆలయంలోకి సిద్ధరామయ్య షూ వేసుకుని వెళ్లిన ఘటన ఇంకా ప్రజలకు మరిచిపోలేదని జనార్దన్ తెలిపారు. తనపై 42 తప్పుడు కేసులు పెట్టి యూపీఏ ప్రభుత్వం తనను నాశనం చేయాలని చూసిందని.. కానీ, వారి కుట్రలు ఫలించలేదని ఆయన చెప్పారు.
కాగా, గాలి జనార్దన్‌కు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్టీలో లేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాలికి హైకమాండ్ అనుమతి ఇవ్వాల్సిందేనని పరివర్తన యాత్ర సందర్భంగా యడ్యూరప్ప అన్నారు.
అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015లో సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బళ్లారిలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గాలి జనార్దన్ రెడ్డి అక్కడి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ బెంగళూరులో నివాసం ఉన్నారు.
ఫిరాయింపుల టెన్షన్...
మధ్య కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఒకప్పుడు బీజేపీకి కంచుకోట. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకు గానూ 5 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మైనింగ్ కుంభకోణమే బీజేపీని ఇక్కడ దారుణంగా దెబ్బతీసింది.ఇప్పుడు మళ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.
బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరైన బీ నాగేంద్ర(కుద్లిగి నియోజకవర్గం) ఈ నెల 27న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆదివాసీ కమ్యూనిటీ నేత అయిన నాగేంద్ర, పార్టీ మారుతుండటం బీజేపీకి భారీ దెబ్బనే. మరోవైపు హోసాపేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పది రోజుల క్రితం యాడ్యూరప్ప నిర్వహించిన పరివర్తన యాత్రకు కూడా హాజరుకాకపోవటంతో ఆనంద్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీజేపీకి వలసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. వారు అంత ప్రభావంతమైన వ్యక్తులు కాకపోవటంతో వారి చేరికకు బీజేపీ విముఖత చూపుతోంది.
ఈ నేపథ్యంలో జనాకర్షణ ఉన్న గాలి జనార్దన్‌ను పార్టీలోకి తీసుకోవటమే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందా ? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment