సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ వాసిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటనపై తాను స్పందిస్తున్నానని, ఇది మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని తెలిపారు. ఈ విషయంలో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నా.. విశాఖవాసిగానే తన స్పందన తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
జీఎన్ రావు కమిటీ సిఫారసులవల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. విశాఖను పరిపాలనపరమైన రాజధానిని చేస్తే మరెంతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నగరమని తెలిపారు. రాజధానికి అన్ని విధాల అనువైన నగరం విశాఖ అని, పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో విశాఖలో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. అమరావతి రైతులకి తగిన న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment