సాక్షి, హైదరాబాద్: ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని, తెలం గాణ రాష్ట్రం ఏర్పడితేనే లక్షల ఉద్యోగాలు మనకొస్తాయని కేసీఆర్ పదే పదే చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలొచ్చాయి. కానీ, విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో శ్రీకాంత్‌రెడ్డి ఆందోళనకారులనుద్ధేశించి మాట్లాడారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
న్యాయస్థానాల చుట్టూ విద్యార్థులు...
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదని గట్టు వాపోయారు. టీఎస్‌పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం అధికార మత్తులో జోగుతున్నారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ నిర్ధిష్టమైన నియమ నిబంధనలు పొందుపరచకపోవటంతో 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూపు–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల కాలేదన్నారు.
‘సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. లక్షల ఉద్యోగాలు కల్పించడం ఎలా సాధ్యమవుతాయని అవహేళన చేసేవిధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు’ అని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అయినా కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకుందన్నారు.
ఇయర్ క్యాలెండర్ ఏమైంది...
ఆర్భాటం కోసమే జూన్ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కా యలు కాసేలా ఎదురుచుస్తున్నారన్నారు. ప్రభుత్వవైఖరిలో మార్పు రాకపోతే, పోరా టాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామ న్నారు.
పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్‌ఏ రహమాన్ మాట్లాడుతూ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కి బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ది ఎలక్షన్, కలెక్షన్, కన్‌స్ట్రక్షన్ సిద్ధాంతమని విమర్శించారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు వేలాది రూపాయల అప్పులు చేసి పిల్లల్ని కోచింగ్ సెంటర్లకు పంపుతున్నారన్నారు. పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి, రెహమాన్, సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రామ్మోహన్ కలెక్టర్‌కు వినతిపత్రం అంజేశారు.
Comments
Please login to add a commentAdd a comment