
సాక్షి, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె పవన్‌పై పలు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదని ఈశ్వరి వ్యాఖ్యానించారు. మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష అని, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదన్నారు.
ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు గిడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరేంత రాజకీయాలు పవన్‌కు తెలియవంటూ సోషల్ మీడియా వేదికగా సటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన గిడ్డి.. పార్టీ ఫిరాయించగానే చంద్రబాబును ఎలా వెనుకేసుకొస్తారంటూ నిలదీస్తున్నారు. గిడ్డి చెబుతున్న వాటిలో ఏమాత్రం వాస్తవం లేదంటూ మండిపడ్డారు.