
సాక్షి, అమరావతి : పోలీస్ ఉన్నతాధికారులు తనకు సెల్యూట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తానే తన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేశానన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. మన దరిద్రం పోవాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఎంపీలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టమెంటరీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను అధ్యయనం చేయమని ఆదేశించారు.
మా ఎంపీలమంతా ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకుసాగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.. సార్ నేనిక్కడ కూలీకి వెళ్లాను.. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతూ వైఎస్ జగన్‌కు కృతజ్ఙతలు తెలుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. పోలీస్ శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి హిందూపురం లోక్‌సభ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఫొటోలో ఉన్నతాధికారులకు తానే మొదట సెల్యూట్ చేసినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment