సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి, ఘటన గురించి అడుగుతారా? అధికారులకు గవర్నర్ నేరుగా ఫోన్లు చేయవచ్చా? కేంద్రానికి గవర్నర్ సీక్రెట్ ఏజెంట్‌గా ఉండడం తప్ప ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి?’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఐపీఎస్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గవర్నర్ ఎవరు? కేంద్రానికి గూఢచారిలా వ్యవహరించడం మినహా ఆయన ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అందుకే గవర్నర్ వ్యవస్థనే వ్యతిరేకించానని చెప్పారు. జగన్‌పై దాడి జరగ్గానే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వేగంగా స్పందించారని, తిత్లీ తుపాన్‌పై వారు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొస్తారు
రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు కేంద్ర ప్రభుత్వ అండ ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ సవాళ్లను నియంత్రించకపోతే అశాంతి తలెత్తుతుందని అన్నారు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం ‘ఆపరేషన్ గరుడ’ స్క్రిప్ట్‌లో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సినీ నటుడు శివాజీ చెప్పినట్టే అంతా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై కావాలనే ప్రాణహాని లేని దాడి చేసి రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నారని ఆరోపించారు. ఇంకా చాలా కుట్రలు చేస్తారని, దానికి మానసికంగా సిద్ధం కావాలని ఐపీఎస్ అధికారులకు సూచించారు. రానున్న కాలంలో అవసరమైతే బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొచ్చి అల్లర్లు సృష్టిస్తారని, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించి, రాష్ట్రపతి పాలన తెచ్చి తాము కోరుకున్న పార్టీని గెలిపించేలా కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
ఆలయాల దగ్గర కుట్రలు చేస్తారు
రాష్ట్రంలో మూడోసారి మూకుమ్మడిగా ఆదాయపు పన్ను(ఐటీ) దాడులు చేస్తున్నారని, వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వీళ్లు(కేంద్రం) చెప్పేవన్నీ చేయలేమన్న ఏపీ అధికారులను తొలగించి, ఉత్తరప్రదేశ్ నుంచి ఐటీ అధికారులను రప్పిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో దేవాలయాల దగ్గర కుట్రలు చేస్తారని, చర్చిలు, మసీద్‌లపైనా దాడులు జరుగుతాయని అన్నారు. తిరుమలను వివాదాస్పదం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, రాష్ట్ర సర్కారును హిందువులకు వ్యతిరేకం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రమణ దీక్షితులు ద్వారా బురద జల్లించారని, నగలు మాయం అయ్యాయని అపోహలు రేకెత్తించారని విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తితే అణచివేశామని, భవిష్యత్తులోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎన్‌హెచ్ అధికారులపై కేసులు పెట్టండి
రహదారి ప్రమాదాల నియంత్రణలో శాస్త్రీయ విధానాలు అనుసరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ఇంజనీరింగ్ అధికారులపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయన శుక్రవారం ఉండవల్లి ప్రజాదర్బార్ హాలులో ఐపీఎస్ అధికారులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణాలను తీసే హక్కు ఎన్‌హెచ్ అధికారులకు ఎవరిచ్చారని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 2016లో 6,442 మంది, 2017లో 6,126 మంది, 2018లో ఇప్పటివరకు 5,653 మంది చనిపోయారని చెప్పారు. అనైతిక కార్యకలాపాలు, అరాచక శక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ఆర్ధిక నేరాలను పూర్తిగా నియంత్రించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద నేరాలు కానున్నాయని, వాటిని పూర్తిగా నియంత్రించాలని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఆనవాళ్లు కనుగొనేందుకు డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఫొటోల మార్ఫింగ్‌కు అడ్డుకట్ట వేయాలి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడి ఫొటో పక్కన తన ఫొటో పెట్టి నిన్ననే మార్ఫింగ్ చేశారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫొటో తీసుకునే మార్ఫింగ్ చేశారంటే అదే సైబర్ మార్ఫింగ్ అని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తులో అనేక అనర్థాలు సంభవిస్తాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టడానికి వీల్లేదన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడారు. శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, 13 జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment