సాక్షి, హైదరాబాద్: విపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో డీజీపీ ఠాకూర్ టీడీపీ నాయకులకన్నా హీనంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు తొత్తునని నిరూపించుకున్నారని వైఎస్సార్ సీపీ మండిపడింది. కత్తితో దాడి చేసిన నిందితుడి గురించి ప్రపంచానికి తెలిసేలోపే ముఖ్యమంత్రి కార్యాలయంలోని వ్యక్తులు పోస్టర్లు విడుదల చేయడం చూస్తుంటే పథకం ప్రకారం పన్నిన కుట్రేనని స్పష్టం అవుతోందని పేర్కొంది. పార్టీ నాయకులు ఈ మేరకు గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి, డీజీపీ, టీడీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు.
ఆ వివరాలు ఇవీ..
- నిందితుడు వైఎస్సార్ సీపీ అభిమాని అయితే జగన్‌పై కత్తితో దాడిచేస్తాడా? లేక సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతో అధికార యంత్రాంగం కథ నడిపితే దాడిచేస్తాడా?
- దాడిచేసిన వ్యక్తి దగ్గర ఏదో ఉత్తరం దొరికిందని తర్వాత కొద్ది గంటల్లోనే డీజీపీ చెప్పారు. ఉత్తరం దొరికితే అదే క్షణంలో ఎందుకు విడుదల చేయలేదు? ఉత్తరం రాయడానికి టైం పట్టిందా? అందుకే అంత టైం తీసుకున్నారా?
- దాడిచేసిన వ్యక్తితో పోలీసులు ఏం చెప్పించదలచుకున్నారు? ఏమీ చెప్పొద్దు, మాక్కావాల్సింది మేం చెప్పుకుంటాం అని నిందితుణ్ణి లోపల పెట్టింది నిజంకాదా?
- జగన్‌పై దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగి మీడియా ఛానళ్లతో ప్రత్యేకించి కొన్ని ఛానళ్ల యాజమాన్యాలతో మాట్లాడి ఆపరేషన్ గరుడ, పోస్టర్ అంటూ రెండింటినీ హైలెట్ చేయాలని గట్టిగాఆదేశాలు ఇచ్చింది వాస్తవం కాదా? తదనుగుణంగా ఆ ఛానళ్లు వ్యవహరించడం ప్రజలు గుర్తించరని చంద్రబాబు అనుకుంటున్నారా?
- హత్యాయత్నం చేసిన వ్యక్తి నోరు మెదపకముందే అతడి తరఫున ఇందుకే దాడిచేశాడంటూ హోంమంత్రి మొదలుకొని టీడీపీ మంత్రులు ఎలా మాట్లాడతారు?
- నేరం చేసిన వాడికంటే ముందు, ఆ నేరాన్ని సమర్థిస్తూ టీడీపీ కేబినెట్ మొత్తం ఎందుకు రంగంలోకి దిగింది? దీని వెనుక మతలబు ఏమిటి?
- సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంలా మాట్లాడారా? కుట్రదారుడిలా మాట్లాడారా?
- అలిపిరి వద్ద దాడి జరిగిన వెంటనే చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లారా? పోలీస్ స్టేషన్‌కు వెళ్లారా? శాంపిల్స్ తీసుకోమని, మెడికల్ సర్టిఫికెట్ తీసుకోమని లేక రోడ్డుమీదే ఏమైనా పడుకున్నారా?
- అంత హడావుడిగా డీజీపీని రంగంలోకి ఎందుకు దింపారు? మాకు గుర్తున్నంతవరకూ డీజీపీగా ఉన్న ఠాకూర్ కడప ఎస్పీగా, రాయలసీమ ఐజీగా పనిచేశారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిమీద ఒక సందర్భంలో దాడిజరిగితే దాన్ని కూడా ఇదే ఠాకూర్ సానుభూతి కోసం చేయించుకున్న దాడిగా చంద్రబాబు ప్రోద్బలంతోనే చెప్పాడని కడపజిల్లా వాసులు, జగన్‌పై దాడి నేపథ్యంలో గుర్తు చేసుకుంటున్నారు.
- చంద్రబాబుమీద అలిపిరిలో దాడి జరిగితే, అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెళ్లి చంద్రబాబును ఎయిర్‌పోర్టులో పరామర్శించి దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుని ‘బాబూ... దేవుడు గొప్పవాడు, నిన్ను కాపాడాడు...’ అంటూ గొప్ప మానవతా వాదాన్ని కనబరిస్తే ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఒక దిగజారిపోయిన రాజకీయ నాయకుడి మాదిరిగా తన మంత్రులుతో ఏంమాట్లాడించారు? ఆయన ఏం మాట్లాడారు?
- చంద్రబాబు మాట్లాడించింది ఒక వంతు, ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియాలో చేయిస్తున్న దుష్ప్రచారం ఇంకోవంతు. ప్రారంభంలో ఒక ఫోర్క్‌తో దాడి జరిగినట్టుగా రాశారు. వెంటనే డీజీపీ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత అది ఫోర్క్‌కాదు, గొంతులు కోసే పదునైన కత్తి అని అందరూ చూసిన తర్వాత మాట మార్చారు. జగన్‌కు స్వల్ప గాయాలు అంటూ మొత్తంగా మాటలు మార్చేశారు.
- డీజీపీ ఎందుకింత హడావిడిగా ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది. దాడిచేసిన వ్యక్తి కులాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది?ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ పరిధిలోని ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులను అంత రెడీగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వెంటనే దాడిచేసిన వ్యక్తిని తమ అదుపులోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతను వైయస్సార్ కాంగ్రెస్ అభిమాని అంటూ ఒక అబద్ధాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
- డీజీపీ చేసిన వ్యాఖ్యల ద్వారా ఆయన కాకీ బట్టులు కాదు పచ్చచొక్కాలు వేసుకున్నట్లు అనిపించడంలేదా?
- పాదయాత్ర ప్రారంభం అవుతున్న సమయంలోనే దాడిచేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో చేరాడంటే.. ఇందులో పథకం ఉందా? లేదా? గడచిన మూడు నెలలుగా జగన్ రాకపోకల్ని నిశితంగా గమనించి దాడి చేశాడంటే ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన దాడేనని అర్థం కావడంలేదా?
- జగన్ ప్రభంజనం ఉందని జాతీయ సర్వేలు తేల్చిన నేపథ్యంలో భౌతికంగా జగన్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్ని ఇలా చేశారు.
- దాడి జరిగిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిగ్రహంతో , సంయమనంతో వివరాలు తెలుసుకుని స్పందించడానికి ప్రయత్నించింది. కానీ ఇది పచ్చిగా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని తేలిపోతోంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఆయన కొడుకుమీద, ఏపీ డీజీపీ మీద తక్షణం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ విచారణను నిజాయితీ పరులైన అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో జరిపించాలని డిమాండు చేస్తున్నాం.
బాబు తొత్తునని నిరూపించుకున్నారు
Published Fri, Oct 26 2018 5:43 AM | Last Updated on Fri, Oct 26 2018 5:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment