సాక్షి, కర్నూలు : జిల్లా ప్రజలను మోసం చేయడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన చేపట్టారని వైఎస్సార్‌సీపీ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విమర్శించారు. 2014 ఆగస్టు 15న ఇచ్చినవన్నీ బూటకపు హామీలే అని మండిపడ్డారు. నాడు అరచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి ఏమోహం పెట్టుకొని జిల్లాకు వస్తున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో శంకుస్థాపన చేసిన సంస్థలు ఎన్ని, వాటిలో పూర్తైనవి ఎన్నో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆమె నిలదీశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందది దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ హబ్, టెక్స్‌టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, గుండ్రేవుల ప్రాజెక్టు ఇలా జిల్లాకు ఇచ్చిన ప్రతి హామీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. పేదల భూములు లాక్కొని నష్టపరిహారం కూడా ఇవ్వలేదంటూ నిప్పులు చెరిగారు. కమీషన్ల కోసమే చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో చంద్రాబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకులు, మంత్రులే దారుణాలు చేస్తుంటే.. ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరంటూ చరిత ప్రశ్నించారు. దాచేపల్లి ఘటన మరువక ముందే డోన్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటని అన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలకు బాబు క్షమాపణ చెప్పాంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అరాచక పాలనకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment