కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అనైతిక రాజకీయాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు స్పందించకపోవడంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో బాధాకరమైనప్పటికీ అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘనకు
పాల్పడుతుంటే అసెంబ్లీలో చూస్తూ ఉండలేకనే బహిష్కరణకు పిలుపునిచ్చామని తెలిపారు. గతంలో తమ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లి ఫిరాయింపుదారులకు విప్‌ను జారీ చేస్తే అది అమలు కాకుండా స్పీకరే అడ్డుకున్నారని, శాసనసభ వ్యవహారాల మంత్రి అప్పటికప్పుడు క్లాజులను రద్దు చేశారని తెలిపారు. కాల్‌మనీపై ప్రభుత్వాన్ని నిలదీసిన తమ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు వేటు వేసి కక్ష సాధింపునకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను మంజూరు చేయకుండా.. టీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులివ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే అసెంబ్లీకి రావడానికి తమ పార్టీ సభ్యులకు ఏ మాత్రమూ అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
పాదయాత్రపై దుష్ప్రచారం... : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఓదార్పుయాత్ర చేస్తానని అనగానే సోనియాగాంధీ, కాంగ్రెస్ నేతలు భయంతో ఏవిధంగా వణికిపోయారో.. ఇప్పుడు పాదయాత్ర చేస్తానని చెప్పగానే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా అదే తరహాలో భయపడుతున్నారని గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. పునాదులు కదులుతాయనే భయంతోనే ప్రజాసంకల్ప యాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment