
సాక్షి, భీమవరం : ఎన్నికల ముందే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడం మంచిదని భీమవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా సంజీవినా అన్నా చంద్రబాబు నాయుడుతో పవన్ చేతులు కలిపారని, ఆయన అంత దిగజారుడు రాజకీయవేత్త ఎవరూ ఉండరని విమర్శలు గుప్పించారు. తడిగుడ్డతో గొంతు కోసే చంద్రబాబుతో పవన్ జతకట్టారని, రాష్ట్రం ముక్కలు చేసేందుకు లేఖ ఇచ్చిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌కు వెనుక నుంచి సలహాలు ఇస్తున్నారని, అలాంటి వారితో కలిసి రాజకీయాలు చేయవద్దని సూచించారు.
గ్రంధి శ్రీనివాస్ శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘పవన్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో కేసీఆర్‌తో అరగంట మంతనాలు జరిపిన మీరు...ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పని చేసింది కేవలం అయిదేళ్లే. భీమవరాన్ని మురికి కూపం చేశారంటున్న మీరు... మీ స్నేహితుడు గంటా శ్రీనివాసరావు వియ్యకుడు రామాంజనేయులు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఈ పదేళ్లలో భీమవరంలో ఏ అభివృద్ధి జరగలేదు. మరి ఆయనపై పవన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు.
గంటా, అంజిబాబు, పవన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటో అందరికీ తెలుసు. జనసేన చాలా చోట్ల అభ్యర్థులను పెట్టి ఇంకా కొన్ని చోట్ల సీపీఎం, సీపీఐ, బీఎస్సీ అభ్యర్థులను పెట్టారు. సోషల్ మీడియాలో యువత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన బాబు టీడీపీలో చేరి ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఆ తరువాత టీడీపీని లాక్కుని ఎన్టీఆర్‌నే బయటకు పంపించిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుతో జత కట్టిన చరిత్ర పవన్‌ది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు మీకు గొప్ప వ్యక్తా?.
పవన్ మీరు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు అని ప్రజలకు అర్థం అవుతోంది. జనసేను టీడీపీలో కలిపిస్తే ప్రజల్లో క్లారిటీ వస్తుంది. మీ విశ్వసనీయత, నిజాయితీ అనేవి నీటిమీద రాతలే అని ప్రజలకు అర్థం అయిపోయింది. మీ అభిమానిగా చెబుతున్నా ప్రజల ముందు మరింత చులకన కావద్దు. దయచేసి మీ నామినేషన్ విత్ డ్రా చేసుకోండి. కనీసం గౌరవం అయినా మిగులుతుంది. గతంలో మీ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఆ సమయంలో నేను పీఆర్పీలోనే ఉన్నా. పార్టీ విలీనం అయినా నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరలేదు. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. అప్పటికీ, ఇప్పటికీ టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. అదే విధానంతో మేము వెళుతున్నాం.
మీరు మాత్రం ఎలాంటి విధానం లేదు. మీరెందుకు రంగులు మార్చుతున్నారో. ఎదుట వాళ్లకు మాత్రం నీతులు చెబుతారు. మీరు చెప్పే మాటలకు, చేసే పనులకు పోలికే ఉండదు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీకు అసలు ఓ విధానం, సిద్ధాంతం అనేదే లేదు. ఇక మీ బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్ చూస్తుంటే ...కేఏ పాల్, మీరు సోదరుల్లాగే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోవడం ఖాయం. ఆయన తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది.’ అని అన్నారు.
చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్...
తెలుగుదేశం-జనసేన అనైతిక పొత్తు బయటపడిందని నర్సాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఒక్క మాట అనని పవన్ కల్యాణ్...ఆయన డైరెక్షన్‌లోనే వైఎస్సార్ సీపీ, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో విద్వేషాలు రగిల్చే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఇకపోతే నాగబాబు తనపై పోటీ చేస్తున్నారని, ఆయనకు తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తనపై నాగబాబు పోటీలోనే ఉండాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment