సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల నిర్వహణకు అవరోధంగా ఉన్న 73 మున్సిపాలిటీలపై స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. ఇదే సమయంలో జూలై 7న ముందస్తు ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌నూ రద్దు చేసింది. ‘వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలి. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వాలి. ఆ అభ్యంతరాలను మరో వారం రోజుల్లోగా ఆయా మున్సిపాలిటీలు పరిష్కరిం చాలి. ఇలా చేశాక 15వ రోజు నుంచి ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టవచ్చు. జీవో 78లోని 8వ నిబంధన ప్రకారం అభ్యంతరాలను పరిష్కరించాలి.
ఒకవేళ ఎవరి అభ్యంతరమైనా పరిష్కరించకపోతే అందుకు కారణాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి. ఈ మొత్తం ప్రక్రియ 14వ రోజుల్లోగా పూర్తిచేసి 15వ రోజున ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ)కు నివేదికను పంపాలి. డీఎంఏ ఇచ్చిన తుది నివేదిక మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) శాఖ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. తదుపరి ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చేపట్టడంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి తుది ఉత్తర్వులు జారీ చేశారు.
రిట్ పిటిషన్లకు అనుమతి..
ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని దాఖలైన పలు రిట్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను చట్ట ప్రకారం పరిష్కరించాలని, వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల ఖరారు వంటివి చట్ట ప్రకారం పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ‘వార్డుల విభజన సమయంలో ఒక వార్డుకు మరో వార్డుకు ఓటర్లు పది శాతానికి మించరాదన్న చట్ట నిబంధన అమలు జరి గేలా చూడాలి. ఓటర్లను వరస క్రమంలోనే విభజన జరగాలనిపేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment