లింబ్డీలో ఓటు హక్కును వినియోగించుకున్న వరుడు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లోని మొత్తం 89 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ (2.1 కోట్ల మంది ఓటర్లలో) నమోదైందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోరుబందర్‌లోని మూడు పోలింగ్ బూత్‌లలో ట్యాంపరింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించగా.. కలెక్టర్‌తో విచారణ జరిపించిన ఈసీ ఈ ఆరోపణలు అసత్యమని తేల్చి చెప్పింది. సూరత్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా కొత్త ఈవీఎంలను ఏర్పాటుచేసి పోలింగ్ కొనసాగించారు. ఈ ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. సీఎం విజయ్ రూపానీ (రాజ్‌కోట్), కాంగ్రెస్ సీనియర్లు శక్తిసింగ్ గోహిల్ (మాండ్వి), పరేశ్ ధనానీ (అమ్రేలీ) వంటి ప్రముఖులు తొలిదశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 14వ తేదీన రెండోదశ (93 స్థానాలకు) ఎన్నికలు జరగనుండగా.. 18న ఫలితాలు వెల్లడిస్తారు.
యువకుల నుంచి వృద్ధుల వరకు..
తొలిసారి ఓటుహక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో కనిపించారు. అటు వృద్ధులు, వివిధ రంగాల ప్రముఖులు ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డారు. సీఎం విజయ్ రూపానీ ఉదయాన్నే ఓటు వేశారు. భరూచ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూడా ఆరంభంలోనే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ‘నా ఓటు వేశాను. ప్రజలు తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి’ అని టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పూజారా కుటుంబంతో సహా రాజ్‌కోట్‌లో ఓటేసిన అనంతరం తెలిపారు. రాజ్‌కోట్ జిల్లాలోని ఉప్లేటా పట్టణంలో 115 ఏళ్ల అజీబెన్ చంద్రవాడియా ఓటేశారు. భరూచ్‌లో పెళ్లి దుస్తుల్లోనే వధూవరులు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెళ్లికి ముందు ఓటుహక్కు వినియోగించుకోవాలనే పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు వీరిద్దరూ పేర్కొన్నారు. గొండల్‌లో స్వామినారాయణ్ వర్గానికి చెందిన సాధువులూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.
‘ట్యాంపరింగ్’ తప్పని తేల్చిన ఈసీ
శనివారం నాటి తొలిదశ ఎన్నికల్లో బ్లూటూత్‌లతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రతినిధులు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోరుబందర్‌లోని 3 ముస్లిం మెజారిటీ పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలకు బ్లూటూత్ అనుసంధానమైనట్లు కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత అర్జున్ మోధ్వాడియా ఆరోపించారు. ‘పోరుబందర్‌లోని పోలింగ్ బూత్‌లలో మొబైల్ బ్లూటూత్ ఆన్ చేయగానే ‘ఈసీవో 105’ అనే బ్లూటూత్ ఆధారిత వ్యవస్థ అందుబాటులో ఉన్నట్లు చూపించింది. దీనర్థం ఎవరో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నట్లే’ అని అన్నారు. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ స్థానిక మీడియా ముందే విచారణ జరిపారు. ఫిర్యాదుదారుడి మొబైల్ బ్లూటూత్ గుర్తించిన మరో బ్లూటూత్ ఈవీఎం కాదని తేల్చారు. మరో పోలింగ్ ఏజెంట్ కొత్తగా కొన్న ఇంటెక్స్ కంపెనీ ఫోన్ మోడల్ ‘ఈసీవో 105’ అని తేల్చారు.
ఉప్లేటాలో ఓటేసిన 115 ఏళ్ల అజీబెన్
Comments
Please login to add a commentAdd a comment