
న్యూడిల్లీ: జులై 24న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది జులై – ఆగస్ట్ మధ్య పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ అవుతున్నట్లు పేర్కొంది.
కాగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
పదవికాలం ముగియనున్న వారు..
►పశ్చిమ బెంగాల్‌లో డెరెక్ ఓబ్రియెన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రాయ్‌ల పదవీకాలం ముగియనుంది.
►గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, దినేష్ జెమల్‌భాయ్ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్ సింగ్ మాథుర్‌జీల పదవీకాలం కూడా ముగియనుంది.
►గోవా నుంచి ఎంపీ వినయ్ డీ టెండూల్కర్
గత ఏడాది జులైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో గెలుపొందింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజిన్హో ఫలేరో తన స్థానానికి, తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment