గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి రాజ్యసభకు ఎన్నికైన పది మంది సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ స్థానాల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. గోవా నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ముగ్గురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికావచ్చింది. ఈ మూడు రాష్ట్రాల నుంచి పదవీ కాలం ముగుస్తున్న పదిమంది రాజ్యసభ సభ్యుల స్థానాల కోసం వచ్చే జూన్ 8 న ఎన్నికలు జరగనున్నాయి.
పదవీ కాలం ముగుస్తున్న పదిమంది ఎంపీలలో ప్రస్తుత కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహమ్మద్ పటేల్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ కూడా ఉన్నారు. స్మృతి ఇరానీ (బీజేపీ), అహమ్మద్ పటేల్ (కాంగ్రెస్), దిలీప్ భాయ్ శివశంకర్ భాయి పాండ్యా (బీజేపీ) లు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాంతారాం నాయక్ (కాంగ్రెస్) గోవా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, డెరెక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), దేబబ్రత బందోపాధ్యాయ (టీఎంసీ), ప్రదీప్ భట్టాచార్య (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), సుఖేందుశేఖర్ రాయ్ (టీఎంసీ), దోలా సేన్ (టీఎంసీ) లు పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు.
వీరిలో శివశంకర్ భాయి జూలై ఆఖరునాటికి పదవీ విరమణ చేస్తుండగా, మిగతా సభ్యుల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం మే 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన షెడ్యూలులో పేర్కొంది.