
గాంధీనగర్: కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు జేఎమ్ ఠాకూర్ గాంధీనగర్‌లో నామినేషన్లు దాఖలు చేశారు. గుజరాత్‌లో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మంగళవారం మొదలైంది. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అమేథి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నిక కావడంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైశంకర్‌ను ఆ స్థానం నుంచి ఎగువసభకు పంపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.
దీని ప్రకారణమే ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గుజరాత్ అసెంబ్లీలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఖాళీ అయిన రెండు స్థానాలను గెలుచుకోనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీతో పాటు కమలం కీలక నేతలు.. వారిద్దరికి అభినందనలు తెలిపారు. జైశంకర్ సోమవారమే బీజేపీ ప్రాథమిక సభ్యుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన అధికారికంగా బీజేపీలో చేరారు.