
సాక్షి, సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత ‘సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కావాలి’ అంటూ వచ్చిన కరపత్రాలు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె చైర్‌పర్సన్ అయితే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందంటూ ఆ పార్టీ జిల్లా నాయకులు పోలా రాధాకృష్ణ పేరుతో ఈ కరపత్రాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఈ కరపత్రాల విషయం ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి నిజంగానే ఆమెను చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపుతారా..? అని టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చర్చ జరిగింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జగదీశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేశారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం, విద్యావంతురాలు కావడంతో ఆమె మున్సిపల్ బరిలోకి దిగుతారా..?’ అని పార్టీ ముఖ్య నేతలు కూడా గుసగుసలాడారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళా కావడంతో మంత్రి ఆమెను బరిలోకి దింపితే స్వాగతిస్తామని కొందరు నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీ కోరికను మన్నించలేక పోతున్న...
శనివారం నామినేషన్లకు చివరి రోజున సునీత స్పందించారు. పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సూర్యాపేట పట్టణ ప్రజలకు నమస్కారం. గత కొద్దిరోజులుగా నన్ను సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికలలో పోటీ చేయాలని చాలా మంది అభిమానులు కోరుతున్నారు. కానీ మా పిల్లల చదువు బాధ్యతల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చెయ్యడానికి సిద్ధంగా లేను. 2014,2018 శాసనసభ ఎన్నికలలో నా భర్త గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో నన్ను ఆదరించి వారిని గెలిపించిన మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న యస్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాను. నాపై అభిమానం చూపించి నన్ను ఆహ్వానించిన మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ కోరికను మన్నించలేక పోయినందుకు క్షమించాల్సిందిగా విజ్ణప్తి చేస్తున్నాను.’ అని ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment